
మనదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో కొన్ని ప్రత్యేకమైన దేవీవేతలకు సంబంధించినవి ఉంటాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర, సంప్రదాయం ఉంటాయి. కొన్ని ఆలయాల్లోని సంప్రదాయాలు కొంత ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ఆలయం ఒకటి కర్ణాటకలో ఉంది. అదే హస్సానంబలోని హసనాంబ దేవాలయం. ఆ ఆలయ ప్రధాన దేవత ఆదిశక్తి. ఈ ఆలయం హోయసల నిర్మాణ శైలిలో నిర్మాణమై ఉంది. హస్సానంబ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే.. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ ఆలయాన్ని భక్తుల కోసం తెరుస్తారు. హిందూ పండగ దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు.
హసనాంబ ఆలయం చీమల పుట్ట ఆకారంలో రూపొందించబడి ఉండటం విశేషం. ఈ ఆలయం గురించి మరో అద్భుత విషయమేమిటంటే.. ఇక్కడ పది తలలతో వీణ వాయిస్తున్న రావణుడి విగ్రహం కూడా ఉంది. ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే.. మీరు సిద్ధేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. శివుడు ఇక్కడ లింగ రూపంలో కాకుండా అర్జునుడికి పాశుపదాస్త్రాన్ని ఇస్తున్నట్లు చిత్రీకరించారు.
ఈ ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచి ఉంటుంది కాబట్టి, దీపావళి పండగ సమయంలో దర్శనం చేసుకోవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. రెండు బస్తాల బియ్యం, నీరు, నంద దీపం అని పిలువబడే నెయ్యి దీపం.. పూలతో అలంకరించిన తర్వాత ఆలయం మూసివేయబడుతుంది. మళ్లీ సంవత్సరం తర్వాతనే తెరవబడుతుంది. ఆలయాన్ని తిరిగి తెరిచినప్పుడు వండిన బియ్యం ఇంకా వేడిగానే ఉంటుంది. చెడిపోదు. నంద దీపంలోని నెయ్యి ఏడాదిపాటు వెలుగుతూనే ఉంటుంది. ఇలాంటి విశేషాలతో ఈ ఆలయానికి ప్రత్యేకత సంతరించుకుంది.
ఒకసారి సప్త మాతలు అని పిలువబడే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారికి, ఇంద్రాణి, చాముండి దక్షణ భారతదేశం వచ్చి.. హసన్ అనే ప్రదేశం యొక్క అందాన్ని చూసి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. మహేశ్వరి, కౌమారి, వైష్ణవి ఆలయంలోపల మూడు చీమల పుట్టలలో నివసించారు. బ్రాహ్మి కెంజమ్మ అనే ప్రదేశంలో నివసించారు. ఇంద్రాణి, వారకి, చాముండి దేవికరే హోందా అనే ప్రదేశంలో ఉన్న బావిలో నివాసం ఉన్నారు.
హసనాంబ పేరుమీదుగానే హస్సానాంబ అనే పేరు వచ్చింది. హస్సానాంబ అంటే.. తన భక్తులను నవ్వుతున్న ముఖంతో అన్ని వరాలు ప్రసాదించే తల్లి అని అర్థం. అమ్మవారిని నమ్మిన భక్తులకు ఇబ్బందులకు గురిచేసిన వారిని ఆమె కఠినంగా శిక్షిస్తారని నమ్ముతారు.
ఒకసారి హసనాంబ భక్తురాలైన ఓ భక్తురాలు ఆలయానికి వచ్చి పూజలు చేసింది. అయితే, ఆమె అత్తగారు ఆమెను తీవ్రంగా కొట్టింది. దీంతో ఆ భక్తురాలు వేడుకోగానే హసనాంబ ఆమెపై కరుణ చూపారు. తన భక్తురాలైన స్త్రీని రాయిగా మార్చి తన వద్దనే ఉంచుకుంది. ఆ రాయిని ‘షోసి కల్’ అని అంటారు. సోసి అంటే కోడలు అని అర్థం. ఆ రాయి ప్రతి సంవత్సరం ఒక బియ్యపు గింజ పరిణామంలో హసనాంబ వైపు కదులుతుందని నమ్ముతారు. ఇది కలియుగం చివరలో హసనాంబ చేరుకుంటుందని చెబుతారు. ఎన్నో ప్రత్యేకతలున్న హసనాంబ ఆలయాన్ని సంవత్సరంలో ఒకసారి మాత్రమే తెరిచి ఉండటంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.