
Guruvayur Temple Story Telugu: జగన్నాటక సూత్రధారి, భక్తుల పాలిట ఆపద్బాంధవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ వెలసిన అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం ఒకటి. భక్తుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు.. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర నిలయం. అందుకే గురువాయూర్‌ను భక్తులు ప్రేమగా భూలోక వైకుంఠం, దక్షిణ ద్వారక అని పిలుస్తుంటారు.
పురాణ కథనం ప్రకారం.. ద్వాపరయుగం చివరి దశలో శ్రీకృష్ణుడు తన అవతార కార్యాన్ని ముగించిన అనంతరం ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెబుతారు. ఆ సమయంలో ద్వారకలో పూజలందుకుంటున్న శ్రీకృష్ణుడి దివ్య విగ్రహం సముద్ర జలాలపై తేలుతూ కనిపించిందట. ఈ విషయం తెలిసిన దేవతల గురువు బృహస్పతి, వాయుదేవుడు కలిసి ఆ దివ్య విగ్రహాన్ని సముద్రం నుంచి తీసుకువచ్చి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించారని స్థల పురాణం వివరిస్తుంది. బృహస్పతి అంటే గురు, వాయుదేవుడు అంటే వాయు. ఈ ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన పవిత్ర స్థలం కావడంతో ఈ ప్రాంతానికి కాలక్రమంలో గురువాయూర్ అనే పేరు వచ్చిందని విశ్వసిస్తారు. గురువు, వాయువు చేత ప్రతిష్టించబడిన పరబ్రహ్మ స్వరూపుడు కావడంతో ఇక్కడ కొలువైన శ్రీకృష్ణుడిని భక్తులు అత్యంత ప్రేమతో గురువాయూరప్పన్ అని పిలుస్తారు.
‘అప్పన్’ అనే పదానికి ద్రవిడ సంప్రదాయంలో తండ్రి అనే అర్థం ఉంది. తన భక్తులను కన్నబిడ్డల్లా కాపాడే తండ్రి స్వరూపుడిగా శ్రీకృష్ణుడిని భావిస్తూ భక్తులు ఆయనను గురువాయూరప్పన్‌గా ఆరాధిస్తారు. చిన్నారి కృష్ణుడి రూపంలో కనిపించే ఆ పరమాత్మను ఒక్కసారి దర్శించుకున్నా మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుందని భక్తుల నమ్మకం.
సాధారణంగా మోక్షప్రాప్తి కోసం మహర్షులు, యోగులు ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సులు చేస్తారని పురాణాలు చెబుతాయి. అయితే గురువాయూర్ శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటేనే పుణ్యఫలం, ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం వేలాది మంది భక్తులు ప్రతిరోజూ ఈ క్షేత్రానికి చేరుకుని కన్నయ్య దర్శనం చేసుకుంటారు.
కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురువాయూర్ క్షేత్రం అనేక వేల సంవత్సరాలుగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఇక్కడ కొలువైన శ్రీకృష్ణుడు తన భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా, కష్టాలను తొలగించే దయామయుడిగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయాడు.
గురువాయూర్ ఆలయంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం మనసును మరో లోకానికి తీసుకెళ్తుంది. మంత్రోచ్ఛారణలు, గంటానాదాలు, ధూపదీపాల సువాసనలు, కన్నయ్య దర్శనం కోసం నిరీక్షించే భక్తుల విశ్వాసం.. ఇవన్నీ కలిసి గురువాయూర్‌ను ఒక అపూర్వమైన దివ్యానుభూతిగా మార్చుతాయి. అందుకే శ్రీకృష్ణ భక్తులకు గురువాయూర్ కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు.. అది కన్నయ్య సాక్షాత్కారం పొందే పవిత్ర స్థలం.. భక్తి పరిమళించే భూలోక వైకుంఠం.
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు పురాణాలు, స్థానిక విశ్వాసాలు, సంప్రదాయ కథనాల ఆధారంగా అందించబడ్డాయి. భక్తుల విశ్వాసాలు ప్రాంతానుసారం మారవచ్చు.)