గోపాష్టమి.. శ్రీకృష్ణుడికి ఈ పండుగకు ఉన్న సంబంధం ఏంటి? గోమాతను ఎందుకు పూజిస్తారో తెలుసా?
2026లో గోపాష్టమి నవంబర్ 17న జరుపుకోనున్నారు. అసలు గోపాష్టమిని ఎందుకు జరుపుకుంటారు? శ్రీకృష్ణుడికి ఈ పండుగకు ఉన్న సంబంధం ఏమిటి? గోమాతను ఎందుకు పూజిస్తారు? ఈ పండుగ వెనుక ఉన్న పురాణ కథ, ఆధ్యాత్మిక విశిష్టత, పూజా సంప్రదాయాలు, గోసేవ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

Gopashtami Significance Telugu: హిందూ ధర్మంలో గోవులను గోమాతగా భావించి పూజిస్తారు. గోవులు పవిత్రత, సంపద, సంతోషం, శ్రేయస్సుకు ప్రతీకలుగా నిలుస్తాయి. అందుకే గోవుల సేవ, సంరక్షణకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. అదే ‘గోపాష్టమి’ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. 2026లో నవంబర్ 17, మంగళవారం నాడు గోపాష్టమి వచ్చింది. ఈ సందర్భంగా ఆలయాలు, గోశాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే గోపాష్టమిని ఎందుకు జరుపుకుంటారు? శ్రీకృష్ణుడికి ఈ పండుగకు ఉన్న సంబంధం ఏమిటి? గోవులను పూజించడం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం.
2026లో గోపాష్టమి ఎప్పుడు?
- అష్టమి తిథి ప్రారంభం: నవంబర్ 17 ఉదయం 4:20 గంటలకు.
- అష్టమి తిథి ముగింపు: నవంబర్ 18 ఉదయం 6:06 గంటలకు.
- ఉదయ తిథి ప్రకారం నవంబర్ 17న గోపాష్టమి జరుపుకుంటారు.
గోపాష్టమిని ఎందుకు జరుపుకుంటారు?
పురాణాల ప్రకారం, బాల్యంలో శ్రీకృష్ణుడు గోవుల దూడలను మాత్రమే మేపేవాడు. అయితే ఒకరోజు నంద మహారాజు అనుమతితో తన అన్న బలరాముడితో కలిసి తొలిసారిగా ఆవులను మేపడానికి వెళ్లాడు. ఈ సంఘటన కార్తీక శుక్ల అష్టమి రోజున జరిగిందని నమ్ముతారు. శ్రీకృష్ణుడి ఈ లీలను ‘గోచరణ లీల’గా పిలుస్తారు. అప్పటి నుంచి ఈ రోజును గోపాష్టమిగా జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైందని పురాణ కథనాలు చెబుతున్నాయి. గోవులను సంరక్షించే శ్రీకృష్ణుడిని గోపాలుడు, గోవిందుడు అని కూడా పిలుస్తారు.
గోవర్ధన పర్వతంతో గోపాష్టమికి సంబంధం ఏంటి?
గోపాష్టమికి గోవర్ధన పర్వత ఘట్టంతో కూడా సంబంధం ఉందని చెబుతారు. ఇంద్రుడి అహంకారాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు బ్రజ ప్రజలతో గోవర్ధన పర్వతాన్ని పూజింపజేశాడు. దీంతో ఆగ్రహించిన ఇంద్రుడు భారీ వర్షాలు కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకులను, గోవులను రక్షించాడు. ఈ ఘట్టం శ్రీకృష్ణుడికి, గోవులకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.
గోపాష్టమి నాడు గోమాతను ఎందుకు పూజిస్తారు?
హిందూ సంప్రదాయంలో గోవును సకల దేవతల నివాసంగా భావిస్తారు. గోవులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారనేది మత విశ్వాసం. అందుకే గోపాష్టమి రోజున ఆవులు, దూడలకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటికి స్నానం చేయించి పసుపు, కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరిస్తారు. అనంతరం పచ్చి గడ్డి, బెల్లం, ఇతర ఆహార పదార్థాలను తినిపిస్తారు.
గోపాష్టమి రోజున పాటించాల్సిన సంప్రదాయాలు
ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి గోమాతను పూజిస్తారు. ఆవులకు హారతి ఇచ్చి, ప్రదక్షిణలు చేస్తారు. వీలైనవారు గోశాలలకు వెళ్లి గోవులకు ఆహారం అందించి సేవ చేస్తారు. గోవులను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఇలా గోమాతకు సేవ చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించి కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు పురాణాలు, హిందూ మత సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి.)




