Golden Sword to Tirumala Lord Venkateswara Swamy: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆభరణాల్లో మరో విలువైన స్వర్ణాభరణం వచ్చి చేరింది. శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఎం శ్రీనివాస ప్రసాద్ దంపతులు స్వర్ణ నందక (బంగారు ఖడ్గం)ను బహూకరించారు. రూ. కోటీ 8 లక్షలు వెచ్చించి 6.5 కిలోల ఈ ఖడ్గాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న దంపతులు.. ఈ స్వర్ణఖడ్గాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి స్వర్ణ ఖడ్గాన్ని హైదరాబాద్‌కు చెందిన ఎం.ఎస్.ప్రసాద్ సమర్పించారు. మారు ఆరున్నర కేజీల బరువున్న ఈ ఖడ్గాన్ని ఆదివారం తిరుమలలోని సమిష్టి అతిథిగృహంలో శ్రీనివాస్ దంపతులు మీడియా ఎదుట ప్రదర్శించారు.
మహావిష్ణువు శ్రీవారిసేవ కోసం 500 ఏళ్ల క్రితం అన్నమాచార్యులను ‘నందక’ అనే ఖడ్గం ద్వారా భూమి మీదికి పంపించారని, అదే పేరుతో శ్రీవారికి స్వర్ణ ఖడ్గాన్ని సమర్పించాలని ఏడాది క్రితం తన మనసులో అనిపించిందని దాత శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు. నిపుణులైన స్వర్ణకారులతో కోయంబత్తురులో ఆరునెలల పాటు ఈ ఖడ్గాన్ని తయారు చేయించినట్టు తెలిపారు.