
Sirimanotsavam Festival: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఉత్సవాన్ని జిల్లా యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించింది. పైడితల్లి అమ్మవారు అంటే ఉత్తరాంధ్ర వాసులకు ఒక విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. అంతటి విశ్వాసం ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అమ్మవారి పండుగను అంగరంగ వైభవంగా జరిపారు. ఎప్పటిలాగే పాలధార, అంజలి రథం, తెల్ల ఏనుగు, బెస్తవారి వల ముందు నడవగా పైడితల్లి అమ్మవారి సిరిమాను మూడుసార్లు విజయనగరం పురవీధుల్లో ఊరేగి, భక్తులకు దర్శనమిచ్చారు. మూడు లాంతర్ల జంక్షన్ లోని చదురు గుడి నుండి తన పుట్టినిల్లు అయిన విజయనగరం కోటవద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పరవశించిపోయారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించటానికి ఉత్తరాంద్ర జిల్లాల నుండి పెద్దఎత్తున భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు.
విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిస్సా, చత్తీస్ఘడ్, మహారాష్ట్రల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించడానికి సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలకు అనుగుణంగా, ఆయన సూచనలతో వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, కలిసికట్టుగా పని చేసి ఉత్సవాలను విజయవంతం చేశాయి.
Sirimanotsavam Festival
గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం సిరిమాను సంబరం శాస్త్రోక్తంగా సాగింది. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. గత ఏడాది ఆలస్యం అవ్వడంతో ఈ ఏడాది అన్ని జాగ్రత్తలు తీసుకొని అమ్మవారి సిరిమానోత్సవాన్ని సకాలంలో పూర్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మొదటి నుంచి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పుర ప్రముఖులతో సమవేశాన్ని నిర్వహించి, ఉత్సవాలపై వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, దానికి అనుగుణంగా అమ్మవారి సిరిమాను పండుగను జరిపారు.
ఉత్సవానికి అమ్మవారి సిరిమానును, ఇతర రథాలను ముందుగానే ఆలయం వద్దకు తీసుకురావడంతో సాయంత్రం 4.37 నిమిషాలకు సిరిమాను రథోత్సవం ప్రారంభమై 6:00 గంటలకు ముగిసింది. తోపులాటలు జరగకుండా, ఉత్సవానికి అంతరాయం కలుగకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేశారు. అమ్మవారి సిరిమాను ప్రశాంతంగా జరగటంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..