
నేటి యువతలో పచ్చబొట్లు వేయించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అందులోనూ దేవుళ్ల చిత్రాలు, ఓంకారం, స్వస్తిక్ వంటి చిహ్నాలను శరీరంపై చెక్కించుకోవడం పట్ల చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలా దైవ చిహ్నాలను పచ్చబొట్టుగా వేయించుకోవడం శుభప్రదమా కాదా అనే సందేహాలపై పండితులు కీలక విషయాలు చెప్పారు. దేవుని పచ్చబొట్టు వేయించుకోవడాన్ని భక్తికి చిహ్నంగా చూడొచ్చని తెలిపారు. వినాయకుడు, వెంకటేశ్వరుడు, ఓంకారం వంటి చిహ్నాలను శరీరంపై ధరించడం ద్వారా ఆ దైవ సాన్నిథ్యాన్ని మనస్సులో నింపుకోవడానికి ఇది ఒక మార్గం. యద్భావం తద్భవతి అన్నట్లుగా.. మన భావన పవిత్రంగా ఉంటే ఇలా పచ్చబొట్లు వేయించుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదని వివరించారు.
శాస్త్రాల ప్రకారం ఈ శరీరం మలమూత్రాలతో కూడిన అశాశ్వతమైన రూపం. కానీ దేవుడు మనస్సులో ఉంటాడు. మనస్సు శరీరంలోనే ఉంటుంది కాబట్టి, పచ్చబొట్టు ద్వారా దేవుడిని ఆవాహన చేయడం ఒక రకమైన భక్తి సంకేతం. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది.. “శరీరంపై దేవుని చిహ్నం ఉందంటే అది ఒక రకమైన దీక్ష తీసుకున్నట్లే లెక్క. రామకృష్ణ మఠం వంటి చోట్ల మంత్ర దీక్ష ఎలా తీసుకుంటారో దైవిక పచ్చబొట్టు కూడా అంతే బాధ్యతతో కూడుకున్నది. ఆ చిహ్నానికి గౌరవం ఇచ్చేలా మన ప్రవర్తన, ఆలోచనలు పవిత్రంగా ఉండాలి” అని పండితులు తెలిపారు.
పచ్చబొట్టు వేయించుకున్న తర్వాత కూడా చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు కలిగి ఉంటే అది జన్మ జన్మల ఇబ్బందులకు దారితీస్తుందని హెచ్చరించారు.
సంకల్పం: పచ్చబొట్టు వేయించుకునే ముందే ఏదైనా ఒక దుర్గుణాన్ని వదిలివేస్తానని సంకల్పం చెప్పుకోవడం శుభప్రదం.
పవిత్రత: ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు ఆ పచ్చబొట్టును అభిషేకించినట్లుగా భావించి, శరీరాన్ని, మనస్సును శుద్ధిగా ఉంచుకోవాలి.
యుక్తవయస్సులో శరీరం ఆకర్షణీయంగా ఉన్నప్పుడు కేవలం ప్రదర్శన కోసం దేవుని పచ్చబొట్లు వేయించుకోవడం సరైంది కాదని పండితులు సూచించారు. వయస్సు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడి, ఆ దైవ రూపం వికృతంగా మారే అవకాశం ఉంటుంది. ఇది అశుభ సంకేతాలకు దారితీస్తుంది. కాబట్టి కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా నిజమైన భక్తితో, నియమాలను పాటించగలమన్న నమ్మకం ఉన్నప్పుడే దైవ చిహ్నాలను పచ్చబొట్టుగా వేయించుకోవాలని సలహా ఇచ్చారు.