హిందూ మతంలో 4 వేదాలు, 18 మహాపురాణాలు ఉన్నాయి. విశేష ప్రాముఖ్యత కలిగిన ఈ మహాపురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. ఈ గరుడ పురాణానికి అధినేత శ్రీ మహా విష్ణు. సనాతన ధర్మంలో ఎవరైనా మరణిస్తే ఆ ఇంట్లో 13 రోజుల పాటు గరుడ పురాణం పారాయణం చేస్తారు. గరుడ పురాణాన్ని 13 రోజుల పాటు చదవడం వల్ల ఆత్మ తన అనుబంధాన్ని ముగించుకుని తిరిగి తన నివాసానికి వెళుతుందని నమ్మకం. అయితే ఆత్మ స్వర్గానికి వెళుతుందా లేదా నరకానికి వెళుతుందా అనేది.. ఆ ఆత్మ జీవితకాలంలో చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా తాము చేసిన కర్మలను బట్టి స్వర్గం లేదా నరకంలో స్థానం పొందుతాడు. నరకంలో కూడా అతను తన కర్మలను బట్టి శిక్షను అనుభవించవలసి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఎవరు ఎటువంటి పనులు చేస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..
గరుడ పురాణం ప్రకారం తనను నమ్మిన స్నేహితుడికి ద్రోహం చేసిన వ్యక్తికి లేదా ఏ విధంగానైనా మోసం చేసిన వ్యక్తికి నరకంలో స్థానం లభిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మరణిస్తే.. ఈ ఆత్మ మరుజన్మ తీసుకుని కొండల్లో నివసించే రాబందుగా మారి చచ్చిన జంతువులను తిని కడుపు నింపుకుంటారట.
ఏ పురుషుడు లేదా స్త్రీ అనైతికంగా లైంగిక వాంఛలకు లోనైనా.. ఎవరైనా ఉపవాసం, శ్రాద్ధాది సమయంలో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే.. వారు కూడా పాప కర్మ చేసినట్లు.. కనుక అటువంటి వ్యక్తులు నరకంలో స్థానం పొందుతారని గరుడ పురాణంలో చెప్పబడింది. అలాంటి వారు తామిస్ర, అంధతామిస్ర, రౌరవ అనే నరకాలను అనుభవించవలసి వస్తుంది.
గరుడ పురాణంలో ఒక్కో పాపానికి ఒక్కో శిక్షను పేర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో అధర్మం ద్వారా తనకు, తన కుటుంబానికి సంపదను పోగుచేసే వ్యక్తి తన జీవితకాలంలో అటువంటి సంపదను పోగొట్టుకుంటాడు. అంతేకాదు మరణానంతరం అతను అన్ని నరకాలను చవిచూడాల్సి ఉంటుంది.
ఎవరైనా తమ జీవితకాలంలో తన తల్లిదండ్రులను లేదా కుటుంబ సభ్యుల పట్ల తప్పుగా ప్రవర్తించిన లేదా హింసించినా అటువంటి వ్యక్తులు మరు జన్మ కోసం ఎదురుచూడాలి. చాలా సంవత్సరాల వరకు భూమి మీద అడుగు పెట్టలేడు. గరుడ పురాణం ప్రకారం ఇలాంటి పనులు చేసే వారు గర్భంలోనే చనిపోతారు.
ఎవరైతే భగవంతుడిని మరచిపోయి తన కుటుంబ సభ్యుల కోసం సంపాదిస్తూ.. కుటుంబమే జీవితం అంటూ కుటుంబ నిర్వహణలో నిమగ్నమై ఉంటారో.. సాధువులకు, మహర్షులకు దానం చేయని వ్యక్తి నరకానికి వెళ్తారు. అంతేకాదు నరకంలో రకరకాల శిక్షలతో దుఃఖానికి లోనవుతారని గరుడ పురాణం పేర్కొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు