Garuda Puran: ఎటువంటి పాపలు చేసిన వ్యక్తుల ఆత్మలు వైతరణి నదిలో పడతారో తెలుసా..

గరుడ పురాణం వైతరణి నది గురించి చెబుతుంది. ఇది మరణాంతరం యమలోకానికి వెళ్ళే మార్గంలో ఉండే నది. పాపులకు భయంకరమైన హింసని ఇచ్చే ప్రదేశం. భూమిపై చెడు పనులు చేసి.. అధర్మపరులుగా జీవించిన వారు మరణించిన తరువాత వారి ఆత్మని యమదూతలు ఈ భయంకరమైన నదిలోకి తోస్తారు. మరణానంతరం యమ లోకం ఎలా ఉంటుంది? యమలోక వైతరణి నదిని దాటడం ఆత్మకు కూడా ఎందుకు సవాలుగా ఉంటుందో తెలుసుకుందాం.

Garuda Puran: ఎటువంటి పాపలు చేసిన వ్యక్తుల ఆత్మలు వైతరణి నదిలో పడతారో తెలుసా..
Garuda Puranam

Updated on: May 27, 2025 | 5:39 PM

హిందూ పురాణ గ్రంథాలు వ్యక్తి మరణం తరువాత అతని ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తాయి. హిందువుల విశ్వాసాల ప్రకారం మరణం తర్వాత మానవ శరీరం మాత్రమే దహనం చేయబడుతుంది. కానీ ఆత్మ కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. పురాణ గ్రంథాలలో కర్మ గురించి వివరించారు. జీవితంలో మనిషి చేసే కర్మలు మరణం తర్వాత జీవి ప్రయాణం ఎలా ఉంటుందో నిర్ణయిస్తాయని అంటారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించడం ఖాయం. కానీ జీవి ప్రయాణం మనిషి మరణం తర్వాత ముగియదు. దీని తరువాత ఆత్మ దాని కర్మ ప్రకారం నరకం, స్వర్గం లేదా మోక్షాన్ని పొందుతుంది. గరుడ పురాణంలో కూడా నరకంలోని హింసలు వివరించారు. దీనిలో జీవి ఏ కర్మల వల్ల నరకంలో బాధపడాల్సి వస్తుందో.. ఏ కర్మల వల్ల కొన్ని జీవులు వైతరణి నదిలో పడతాయో చెప్పబడింది.

యమలోకానికి వెళ్ళే దారిలో వైతరణి నది ఉంది. ఈ నదిని శాస్త్రాలలో చాలా భయంకరమైన.. బాధాకరమైన నదిగా వర్ణించారు. పాపులు చేసిన చెడు పనులకు శిక్షణను ఈ ఈ వైతరణి నదిలో వేసి శిక్షించబడతారు . అంతేకాదు అనేక రకాల హింసలను భరించాల్సి ఉంటుంది. ఈ రోజు మనం గరుడ పురాణంలో వివరించిన ఈ నది గురించి తెలుసుకుందాం. మనిషి చేసిన కర్మల కారణంగానే మరణం తరువాత ఆత్మ వైతరణి నదిలోకి నెట్టబడుతుంది. యమ లోకంలో ఎలా ఉంటుంది? యమలోకంలో వైతరణి నది ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

గరుడ పురాణంలో వైతరణి నది ప్రస్తావన

ఇవి కూడా చదవండి

ఒకసారి గరుత్మంతుడు శ్రీ మహా విష్ణువుని మానవులు ఎటువంటి పాపాలు చేసే వైతరణి నదిలో పడవేస్తారు అని అడిగాడు. అప్పుడు విష్ణువు మంచి పనులకు దూరంగా ఉండి, ఎల్లప్పుడూ పాపపు పనులను చేసేవారు ఒక నరకం నుంచి మరొక నరకానికి వెళ్లాల్సి ఉంటుందని, ఒకదాని తర్వాత ఒకటి బాధలను అనుభవించాల్సి ఉంటుందని.. ఒకదాని తర్వాత ఒకటి భయాన్ని భరించాల్సి ఉంటుందన చెప్పాడు. పాపాత్ములను యమ లోకానికి దక్షిణ ద్వారం గుండా తీసుకువెళతారు. ఈ మార్గం మధ్యలో వైతరణి నది వస్తుంది. ఈ నది రక్తము, చీము, మూత్రం, ఇతర మురికి వస్తువులతో నిండి ఉంటుంది. ఈ నదిలో పాపాత్మలు వెళ్తాయి.

భూమిపై బ్రాహ్మణులను చంపేవారు, మద్యం తాగేవారు, పిల్లలను చంపేవారు, ఆవులను వధించేవారు, స్త్రీలను చంపేవారు, గర్భస్రావాలు చేయించేవారు, గురువుల సంపదను దోచుకునేవారు, బ్రాహ్మణుల నుంచి సంపదను దోచుకునేవారు ఈ వైతరణీ నదిలో పడిపోతారు.

అప్పు చేసి తిరిగి చెల్లించని వారు, ద్రోహం చేసేవారు, విషం పెట్టేవారు, సాధువుల పట్ల అసూయపడి వారి గుణాలను ప్రశంసించని వారు, తమకంటే తక్కువవారిగా భావించి గౌరవించని పాలకులు, మంచి సహవాసానికి దూరంగా ఉండేవారు, తీర్థయాత్ర స్థలాలను, సాధువులను, గురువులను, దేవతలను అవమానించేవారు, పురాణాలను, వేదాలను, న్యాయాలను, వేదాంతాలను అవమానించేవారు, విచారంగా ఉన్న వ్యక్తిని చూసి సంతోషించే వారు, ఇతరులను బాధపెట్టేవారు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు కూడా వైతరణి నదిలో పడిపోతారు. ఈ అధర్మ జీవులందరూ పగలు రాత్రి దుఃఖిస్తూ యమ లోక మార్గంలో నడుస్తూనే ఉంటారు. ఈ మార్గంలో జంతువులు రాక్షసుల దాడులను భరించవలసి ఉంటుంది. దీని తరువాత యమదూతలు ఆత్మలను కొట్టి వైతరణి నదిలోకి విసిరేస్తారు.

తల్లి, తండ్రి, గురువు , ఇతర గౌరవనీయ వ్యక్తులను అవమానించేవారు, బ్రాహ్మణులకు వాగ్దానం చేసిన తర్వాత నిర్మలమైన హృదయంతో దానం చేయని వారు, ఇతరులు దానం చేయకుండా ఆపేవారు, కథ చెప్పేటప్పుడు అంతరాయం కలిగించేవారు, తమ స్వార్థం కోసం జీవులకు హాని చేసేవారు, మాంసాహారులు, శాస్త్రాలను నమ్మనివారు, స్త్రీలను అపహరించేవారు, బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలనుకునే వారు వైతరణి నదిలో పడతారు. దారిలో వీరి ఆత్మలు అన్ని రకాల హింసలు అనుభవించిన తర్వాత.. యముడి రాజభవనానికి చేరుకుంటాయి. అక్కడ యముడి ఆదేశం మేరకు.. యమ దూతలు అక్కడికి చేరుకున్న పాపుల ఆత్మలను మరోసారి వైతరణి నదిలోకి నెట్టివేస్తారు.

వైతరణి నది అన్ని నరకాలలోకి అత్యంత బాధాకరమైనదని భగవంతుడు వివరిస్తున్నాడు. ఈ కారణంగా యమ దూతలు పాపులను ఈ నదిలోకి విసిరేస్తారు. మత గ్రంథాలు, గరుడ పురాణం ప్రకారం ఆధ్యాత్మిక మార్గంలో మంచి నడవడికతో నడిచే వ్యక్తులు వైతరణి నది నీటిని అమృతంగా భావిస్తారు. అయితే పాపాత్ములు ఈ నదిని రక్తంతో నిండినదిగా భావిస్తారు. వైతరణి నది వంద యోజనాల వరకు విస్తరించి ఉంటుందని భారీ సంఖ్యలో రాబందులు, చేపలకు నిలయంగా ఉందని నమ్ముతారు. ఈ నది నీరు నిత్యం మరుగుతూ ఉంటుంది. ఈ నది మురికి, దుర్వాసన, మాంసంతో పాటు అనేక రకాల జీవులతో నిండి ఉంటుంది. భయంకరమైన జీవ హింసలు, నిరంతం మరిగే నీటి కారణంగా వైతరణి నదిలో పడిపోయిన పాపుల ఆత్మలు ఎడ తెరపి లేకుండా ఏడుస్తూ ఉంటారు. ఈ నదిని దాటడం పాపులకు చాలా కష్టం. ఈ బాధను నివారించడానికి కొన్ని నివారణలు కూడా పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.

మరణ సమయంలో ఆవు దానం
పురాణాల ప్రకారం ఒక వ్యక్తి మరణ సమయంలో ఆవును దానం చేస్తే అది అతని ఆత్మ వైతరణి నదిని దాటడానికి సహాయపడుతుంది. మీరు ఈ నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు.. అక్కడికి ఒక ఆవు వచ్చి, “మీకు ఏదైనా మంచి పని తెలిస్తే చెప్పు” అని అడుగుతుందని అంటారు. ఆవును దానం చేసిన వారు.. ఆవు తోకను పట్టుకుని భయంకరమైన వైతరణి నదిని నైపుణ్యంగా దాటుతారట.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు