సమస్త మానవాళి క్షేమం కోసం భగీరధుడి కోరిక మేరకు దివి నుంచి భువికి ఏతెంచింది గంగా దేవి. అలా భూమి మీదకు గంగమ్మ అడుగు పెట్టిన రోజుని గంగా దసరగా జరుపుకుంటాము. ఈ ఏడాది జూన్ 16, 2024 ఆదివారం రోజున గంగా దసరా వచ్చింది. అయితే ఈ రోజున 100 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్చికం ఏర్పడనుంది. జూన్ 16వ తేదీన హస్తా నక్షత్రంలో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం అనే శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాల కలయికతో గంగా దసరా రోజున చేసే స్నానానికి విశిష్ట స్థానం ఉంది. ఈ రోజున చేసే నదీ స్నానం, పూజలు, దానాలకు అత్యంత ఫలవంతం అని నమ్మకం. అంతేకాదు తెలిసి, తెలియక చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. ఇక ఆ రోజున ఏర్పడే శుభ యోగాల కొన్ని రాశులపై అంటే మేష రాశి, మిధున రాశి, కుంభం వంటి రాశులకు చెందిన వ్యక్తులపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. వీరు ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు పొందుతారు. గంగా దసరా రోజున చేసే స్నానం దానాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.
పంచాంగం ప్రకారం గంగా దసరా రోజున గంగా స్నానం లేదా నదీ స్నానం చేయడానికి, పూజకు దానాలకు శుభ సమయం ఉదయం 4:03 నుంచి 4:43 వరకు.. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:50 వరకు ఉంటుంది. ఇక సంధ్యా ముహూర్తానికి అనుకూలమైన సమయం.. సాయంత్రం 7:20 నుంచి 7:40 వరకు ఉంటుంది. ఈ సమయాల్లో గంగానదిని పూజించడం, నదీ స్నానం చేయడం వల్ల పూర్వీకులకు సుఖం, మోక్షం కలుగుతాయని నమ్మకం.
గంగా దసరా పండుగ రోజున స్వర్గం నుంచి గంగాదేవి శరవేగంగా భూమి మీదకు దూసుకు వస్తుంటే.. శివుడు తన శిగలో బంధించి గంగమ్మ భీకర వేగాన్ని తగ్గించి భూమిపైకి విడిచినట్లు.. తద్వారా శివుడు భగీరథుడి చేసిన తపస్సును మెచ్చి తపః ఫలాలను ఇచ్చాడని నమ్మకం. పూర్వీకులు మోక్షాన్ని పొందేందుకు.. గంగా దసరా పరమ పవిత్రమైన రోజుగా నమ్ముతారు. ఈ రోజున చేసే నదీ స్నానం.. మనసు స్వచ్ఛత, మోక్షం, పుణ్యాన్ని పొందేందుకు మార్గాన్ని సూచిస్తుంది.
గంగా దసరా రోజున సూర్యోదయ సమయంలో నిద్రలేచి గంగా నదిలో స్నానం చేయాలి. గంగా నదికి చేరుకోవడం సాధ్యం కాకపోతే.. ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగాజలం కలపండి. ఆ తర్వాత గంగామాత విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి, పుష్పాలను సమర్పించి, గంగా స్తోత్రాన్ని పఠించండి. ఈ రోజున నీరు, ధాన్యాలు, వస్త్రాలు , డబ్బును అవసరమైన వారికి దానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొంది జీవితం ఆనందంగా సాగుతుందని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు