Ganesh Chatuthi 2023: వినాయక చవితి ఎందుకు విశిష్టమైన పండగ.. మొదట పూజ గణపతికి ఎందుకు చేస్తారో తెలుసా..

|

Sep 11, 2023 | 8:35 AM

హిందూ మతంలో గణేశుడు మొదటి పూజను అందుకునే స్థానాన్ని దేవతలిచ్చారు. గణేశుని ఆశీర్వాదం లేకుండా ఏ శుభ కార్యమూ సంపూర్ణమైనట్లు పరిగణించబడదు. గణేశుడు జ్ఞానం, తెలివి, ఆనందం, శ్రేయస్సు కారకుడిగా పరిగణిస్తారు. గణేశుడి ఆశీస్సులతో జీవితంలోని అన్ని కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు మొదటిగా గణపతిని పూజిస్తారు.

Ganesh Chatuthi 2023: వినాయక చవితి ఎందుకు విశిష్టమైన పండగ.. మొదట పూజ గణపతికి ఎందుకు చేస్తారో తెలుసా..
Vinayaka Chavithi
Follow us on

హిందూ మతానికి చెందిన అతిపెద్ద పండుగల్లో ఒకటైన వినాయక చవితి పండగ మరికొన్ని రోజుల్లో జరుపుకోనున్నాం.. భాద్రపద మాసం శుక్ల పక్షంలోని చవితి తిధి రోజున గణపతి జన్మదినోత్సవాన్ని హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ తిధి సెప్టెంబర్ 18న,  సెప్టెంబర్ 19 న వచ్చింది. దీంతో కొందరు 18న చవితిని జరుపుకుంటుంటే.. మరికొందరు 19న జరుపుకోనున్నారు. నవరాత్రి ఉత్సవాలను 10 రోజుల పాటు జరుపుకుంటారు. అనంత చతుర్దశి నాడు ఈ ఉత్సవాలు ముగుస్తాయి. గణేష్ ఉత్సవాల సమయంలో.. గణపతి విగ్రహాన్ని ఇళ్లలో ప్రతిష్టించి, 10 రోజుల పాటు పూర్తి నియమ నిష్టలతో  పూజిస్తారు. గణపతి ఈ 10 రోజులు భూమిపై ఉండి భక్తుల కష్టాలను తొలగిస్తాడని నమ్మకం.

గణపతిని భక్తితో కొలిచే భక్తులు ఊరువాడా విగ్రహాలను ప్రతిష్టిస్తారు. గణేష్ ఉత్సవాన్ని 10 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. గణేష్ ఉత్సవాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు అనేక ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మండపాల్లో ఏర్పాటు చేసే గణపతి విగ్రహాల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

ఆది పూజ్యుడు గణపతి

హిందూ మతంలో గణేశుడు మొదటి పూజను అందుకునే స్థానాన్ని దేవతలిచ్చారు. గణేశుని ఆశీర్వాదం లేకుండా ఏ శుభ కార్యమూ సంపూర్ణమైనట్లు పరిగణించబడదు. గణేశుడు జ్ఞానం, తెలివి, ఆనందం, శ్రేయస్సు కారకుడిగా పరిగణిస్తారు. గణేశుడి ఆశీస్సులతో జీవితంలోని అన్ని కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు మొదటిగా గణపతిని పూజిస్తారు. దీనికి కారణం ఏమిటంటే.. శివపార్వతుల ప్రథమ కుమారుడు గణపతిని మొదటిసారి పూజించే దైవం స్థానాన్ని ఎందుకు పొందారో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

నిజానికి దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. ఒకప్పుడు దేవతలందరిలో ఎవరిని మొదట పూజించాలనే విషయంలో వివాదం ఏర్పడింది. దేవతలందరూ తమను తాము ఉత్తములుగా ప్రకటించుకోవడం ప్రారంభించారు. తమలో తాము కలహించుకోవడం ప్రారంభించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి శివుడిని ఆశ్రయించమని సలహా ఇచ్చాడు నారదుడు. దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళినప్పుడు.. శివుడు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక పథకాన్ని ఆలోచించాడు. ఎవరైతే విశ్వమంతా సంచరించి ముందుగా తమ వద్దకు చేరుకుంటారో వారు దేవతలతో పాటు భూలోకంలో ముందుగా పూజలను అందుకుంటారని దేవతలందరికీ చెప్పాడు.

తన తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేసిన గణేశుడు

శివుడు చెప్పిన మాటను విన్న దేవతలందరూ తమ తమ వాహనాలపై కూర్చొని విశ్వమంతా సంచరించడానికి బయలుదేరారు. ఆధిపత్య కోసం జరుగుతున్న ఈ రేసులో వినాయకుడు కూడా పాల్గొన్నాడు. అయితే గణేశుడు విశ్వం చుట్టూ తిరగకుండా.. తన తల్లిదండ్రుల చుట్టూ అంటే శివపార్వతుల చుట్టూ 7 సార్లు తిరిగాడు. అనంతరం తల్లిదండ్రులకు చేతులు జోడించి నిలబడ్డాడు. దేవతలందరూ విశ్వం చుట్టూ ప్రదక్షిణలు చేసి శివుడిని చేరుకునే సరికే.. అప్పటికే శివయ్య చెంతన నిలబడిన వినాయకుడు కనిపించాడు. అనంతరం శివుడు.. గణపతిని విజేతగా ప్రకటించాడు.

ఇది చూసి దేవుళ్లంతా ఆశ్చర్యపోయారు.. విశ్వ ప్రదక్షిణలు చేయని వినాయకుడిని ఎందుకు విజేతగా ప్రకటించారంటూ శివుడిని ప్రశ్నించారు. ఈ విషయంపై శివుడు మాట్లాడుతూ విశ్వంలో శివపార్వతుల స్థానం సర్వోన్నతమైనదని.. సమస్త లోకానికి తల్లిదండ్రులు కనుక గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు తిరిగాడని వివరించారు. అప్పుడు గణేశుడుని విజేతగా ప్రకటించారు. దేవతలందరూ శివుడు తీసుకున్న  నిర్ణయానికి అంగీకరించారు. అలా గణేశుడు మొదట పూజను అందుకునే స్థానాన్ని పొందాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)