
పండగంటే ఆనందం.. పండగంటే సంబరం.. అందరూ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే గగనవీధుల్లోంచి శాంతాక్లాజ్ దిగివస్తాడు.. పిల్లలకు బోలెడన్ని కానుకలను అందిస్తాడు.. పిల్లల మోముల్లో ఆనందాన్ని చూసి మురిసిపోతాడు.. శాంతాక్లాజ్‌గా పిలుచుకునే సెయింట్ నికోలస్ క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళతాడన్నది ఓ నమ్మకం.. అందుకే క్రిస్మత్ తాతంటే పిల్లలకు ఎంతో ఇష్టం!
ఇంతకీ శాంతాక్లాజ్ ఎవరు..? ఊహాజనితమా..? నిజంగానే ఉన్నాడా..? ఉన్నాడనే అంటున్నారు చరిత్రకారులు. శాంతాక్లాజ్ ఓ ఊహాజనితమైన వ్యక్తి అని అనుకుంటారు కానీ.. ఆయన నిజంగానే ఉన్నారు.. కాకపోతే ఇప్పుడాయన భూమ్మీద లేరంతే! మొన్నామధ్య శాంతాక్లాజ్ సమాధిని టర్కీకి చెందిన పురావస్తుశాఖ వారు కనుగొన్నారు కూడా!
దక్షిణ టర్కీ అంటాల్యా ప్రొవిన్స్‌లోని డేమేరే జిల్లాలో ఉన్న చర్చి కింద శాంతాక్లాజ్ సమాధి ఉందని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ చెబుతోంది.. శాంతాక్లాజ్ అక్కడే పుట్టారనడానికి చారిత్రక గ్రంథాలే సాక్షి! చర్చిలోపల ఉన్న ఖాళీ ప్రదేశాలను పరిశీలిస్తున్నప్పుడు ఈ సమాధి వెలుగులోకి వచ్చింది. ఇన్నేళ్లయినా ఈ సమాధి చెక్కు చెదరకపోవడం ఓ విశేషం. మైరా బిషప్‌గా ఉన్న నికోలస్ బతికినంత కాలం క్రిస్మస్‌కు ముందు రోజు పిల్లలకు కానుకలను ఇచ్చేవారట! తన ఆదాయాన్నంతా పేద పిల్లలకే ఖర్చు పెట్టేవాడు. అప్పట్లో శాంతాక్లాజ్ వేడుకలు డిసెంబర్ ఆరున జరిగేవట! తదనంతర కాలంలో డిసెంబర్ 24కు మారింది. ఆ రోజున శాంతాక్లాజ్ ఆకాశంలో పయనిస్తూ పిల్లలకు కానుకలు ఇస్తాడని నమ్మకం.. క్రీస్తుశకం 343లో శాంతాక్లాజ్ మరణించారు..