Dattatreya Temple: మనదేశంలోనే అతిపెద్ద జిల్లా గుజరాత్ కచ్. జిల్లాలో కాలో దుంగార్ అనే ఎత్తైన పర్వతం ఉంది. ఈ పర్వత్వం నల్లగా ఉంటుంది కనుక కాలో దుంగార్ పేరు వచ్చిందని స్థానికుల కథనం. ఈ పర్వతం ఎత్తు పదిహేను వందల అడుగులు.. దీనిని ఎక్కి చూస్తే చుట్టుపక్కల ప్రాంతాలే కాదు… పాకిస్థాన్ భూభాగం కూడా కనిపిస్తుంది. అందుకనే పర్యాటకులను ఈ పర్వత ప్రాంతం విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ దత్తాత్రేయ ఆలయం కూడా ఉంది.
ఈ ఆలయం చిన్నది.. అయితే అత్యంత విశిష్టత కలిగి ఉంది. ఈ ఆలయ విశిష్టత తెలుపుతూ అనేక కథలున్నాయి. త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయులు ఇక్కడ సంచరించారట. అప్పుడు కొన్ని నక్కలు దత్తాత్రేయుల వద్దకు వచ్చి ఆహారం కోసం చూశాయట.. అయితే అప్పుడు ఆయన దగ్గర ఏమీ లేకపోవడంతో తన చేతినే నక్కల ముందు ‘లే అంగ్’ (నా శరీరభాగాన్ని తీసుకో) అంటూ తన చేతినే వాటికి అర్పించారట.
మరొకకథ ప్రకారం ఒకానొక రాజు.. దత్తాత్రేయుని దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. ఆ రాజు తపస్సుని పరీక్షించేందుకు దత్తాత్రేయులు నక్క రూపంలో రాజు దగ్గరకు చేరుకుని తన ఆకలి తీర్చమని అడిగారట. ఆ రాజు రుచికరమైన భోజనాన్ని నక్క ముందు ఉంచాడు. నాకు మాంసాహారం ఇష్టం.. అటువంటి నా ముందు ఇటువంటి ఆహారం పెడతావా ఇదేనా నీ దానగుణం అని ఆ రాజుని నక్క అడిగిందట అప్పుడు రాజు తన చేతిని నరికి నక్కకు ఆహారంగా ఇచ్చాడట.రాజు దానగుణానికి ప్రసన్నులైన దత్తాత్రేయులు రూపంలో
సాక్షాత్కరించారని చెబుతారు.
ఇక్కడ ఆలయాల్లో గత 400 సంవత్సరాలుగా నక్కలకు ప్రసాదాన్ని అందించే ఆచారం కొనసాగుతూనే ఉంది. పూజారి రోజూ మూడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఓ పళ్లెం మీద కొడుతూ ‘లే అంగ్, లే అంగ్’ అని అరుస్తాడు. దీంతో నక్కలు ఆలయం వద్దకు చేరుకుంటాయి. అరుగు మీద పూజారి ఉంచిన ప్రసాదాన్ని తింటాయి. చాలా సందర్భాలలో బెల్లంతో చేసిన పరమాన్నాన్నే ప్రసాదంగా పెడుతూ ఉంటారు.
కాలో దుంగార్లో జరిగే ఈ వింతను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. ఇలా ఎన్ని వందల మంది ఆ ఆలయం చుట్టుపక్కల తిరుగుతున్నా, నక్కలు ఎవరిపైనా దాడి చేసిన సంఘటన ఇప్పటివరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఇదంతా దత్తాత్రేయుని మహిమ అంటారు భక్తులు.
Also Read: మోషన్స్ తో బాధపడుతున్నారా.. గసగసాల కూర తింటే వెంటనే రిలీఫ్.. ఎలా తయారు చేయాలంటే