
హిందూ ధర్మంలో వారంతోని ప్రతి రోజుకూ ఓ విశిష్టత ఉంటుంది. ఎందుకంటే, ప్రతి వారానికి ఒక దేవతను అధిష్ఠాన దేవుడిగా భావిస్తారు. వాటిలో ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు జీవనశక్తికి, ఆరోగ్యానికి, తేజస్సుకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పూజింపబడతాడు. ఆదివారం సూర్యుని ఆరాధన చేయడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య, ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి.
సూర్యుడు గ్రహాలకు అధిపతి. ఆయనే సమస్త జీవులకు శక్తిని అందించే దేవుడు. అందుకే సూర్య భగవానుడిని ఆరాధిస్తే శరీర ఆరోగ్యం, మానసిక బలం, జీవితంలో స్థిరత్వం లభిస్తాయని నమ్మకం.
ఆదివారం సూర్యారాధన వల్ల కలిగే ముఖ్య ఫలితాలు
ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఆదివారం ఉదయం సూర్యునికి నీటిని అర్పించడం వల్ల శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. కంటి సమస్యలు, అలసట, రోగనిరోధక శక్తి లోపం వంటి సమస్యలు తగ్గుతాయని విశ్వాసం.
ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు
సూర్యుడు ఆత్మగౌరవానికి కారకుడు. ఆయనను భక్తితో ఆరాధిస్తే
భయాలు తగ్గుతాయి. ధైర్యం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి. ఉద్యోగం, గౌరవం, అధికార యోగం కలుగుతుంది.
సూర్యారాధన వల్ల ఉద్యోగ జీవితంలో గుర్తింపు, ఉన్నతాధికారుల మద్దతు, ప్రభుత్వ సంబంధిత పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తండ్రి సంబంధిత సమస్యలు తగ్గుతాయి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు తండ్రిని సూచిస్తాడు. తండ్రితో విభేదాలు, కుటుంబ గౌరవానికి సంబంధించిన సమస్యలు ఉంటే సూర్య భగవానుడి ఆరాధనతో పరిష్కారం లభిస్తుందని నమ్మకం.
గ్రహ దోష నివారణ
జాతకంలో సూర్య దోషం, గ్రహబలం తగ్గడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఆదివారం సూర్యారాధన ద్వారా కొంతవరకు తగ్గుతాయని భావిస్తారు.
ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి
తామ్ర పాత్రలో నీరు తీసుకుని, అందులో ఎర్ర పువ్వు లేదా కుంకుమ వేసి సూర్యునికి అర్పించాలి
“ఓం సూర్యాయ నమః” మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించాలి
ఆదివారం ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాలు ధరించడం శుభకరం
గోధుమలు, బెల్లం, ఎర్ర పండ్లు దానం చేయడం మంచిదిగా భావిస్తారు.
ఆదివారం సూర్య భగవానుడి ఆరాధన వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం
గౌరవం, అధికార యోగం, కుటుంబ శాంతి, గ్రహ దోష నివారణ వంటి శుభఫలితాలను అందిస్తుందని భక్తుల నమ్మకం. భక్తితో, నియమంతో చేసే సూర్యారాధన జీవితం మీద సానుకూల ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.