
దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకల సందడి మొదలైంది. రామ జన్మ భూమి అయోధ్య దీపావళికి ముందు దీపోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 23న అయోధ్యలోని రామ్‌కీ పైడి ఘాట్‌లలో ఆరవ దీపోత్సవ్ (దీపాల పండుగ) జరుపుకోవడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది కూడా లక్షలాది దీపాలను సరయు తీరంలో వెలిగించనున్నారు.
12 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో 5.84 లక్షల దీపాలు వెలిగించి కొత్త రికార్డు సృష్టించారు. గతేడాది దీపోత్సవంలో 9 లక్షల మట్టి దీపాలు వెలిగించారు. ఈ ఏడాది దీపోత్సవం కోసం అయోధ్య, లక్నో, గోండా తదితర జిల్లాల నుంచి మట్టి కుండలను తెప్పిస్తున్నామని, రామ్ పడిలో దీపాల సేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైందని జిల్లా యంత్రాంగం చెప్పింది.
Grand Deepotsav ? in Ayodhya on the banks of River Saryu where 5.51 lakh diyas(Earthen Lamps) are being lit .
?Live : https://t.co/PgTCOGF8KA pic.twitter.com/ftm126rJK5
— All India Radio News (@airnewsalerts) November 13, 2020
ఈ దీపోత్సవంలో దీపాలు.. 30 నిమిషాలకు పైగా వెలుగుతాయని పేర్కొంది. ఇది గత ఐదేళ్లలో దీపాలు వెలిగిన సమయం కంటే చాలా అధికం. దీపోత్సవాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వస్తారు. అంతేకాదు ఈ దీపోత్సవంలో దీపాలు వెలిగించే ప్రమిదల్లో 30 మిల్లీ లీటర్లకు బదులుగా 40 మిల్లీలీటర్ల నూనెను పోయనున్నారు. తద్వారా ఎక్కువ సేపు దీపాలు వెలగనున్నాయి. దీంతో దీపాలు అధిక సమయం కాంతులు వెదజల్ల నున్నాయి. ఈ దీపోత్సవంలో రాముడు, సీతాదేవి వారి ‘పుష్పక్ విమానం’లో అయోధ్యకు రానున్నారు. లేజర్, సౌండ్ షో, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.
గత సంవత్సరం 2021లో ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అయోధ్యలో ఘనంగా దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. రామ్ కి పైడి ఘాట్‌లలో దీపోత్సవ ప్రదర్శన” కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..