తిరుమల కొండపై కొత్తగా డిక్లరేషన్ బోర్డులు వెలిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఆలయాల్లో హైందవేతరుల ప్రవేశం గురించి నిబంధనలు ప్రకటిస్తూ తిరుమల కొండపై పలు చోట్ల పోస్టర్లు, బోర్డులు ఏర్పాటు చేశారు. హిందువులు కాని వ్యక్తులు తిరుమల ఆలయానికి రావాలనుకుంటే, తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సిందేనని వాటిలో స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వరుని పట్ల తమకు విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధన గురించి మరోసారి ఆ డిక్లరేషన్ బోర్డుల్లో గుర్తు చేశారు.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్ని ఉప విచారణ కార్యాలయాలు, రిసెప్షన్ కార్యాలయం, అదనపు కార్యనిర్వాహణాధికారి క్యాంప్ కార్యాలయం ప్రాంతాల్లో ఈ ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈమేరకు తిరుమలలో 4 నోటీసు బోర్డులు వెలిశాయి. వైకుంఠం -17 దగ్గర గతంలోనే డిక్లరేషన్ బోర్డ్ ఉంది. జగన్ పర్యటన నేపథ్యంలో మరో 3 బోర్డులు వెలిశాయి. వైకుంఠం -2, వైకుంఠం సర్కిల్, జేఈవో ఆఫీస్ దగ్గర ఈ డిక్లరేషన్ బోర్డును ఏర్పాటు చేసింది టీటీడీ.
మరోవైపు.. మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన కాసేపటికే తిరుమల కొండపై ఏర్పాటు చేసిన బోర్డులను టీటీడీ సిబ్బంది తొలగించడం గమనార్హం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటుచేసిన బోర్డు మినహా అన్నిచోట్ల బోర్డులను తీసివేసింది టీటీడీ. జగన్ పర్యటన రద్దవడంతో వాటిని టీటీడీ తొలగించిందనే చర్చ జరుగుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..