YS Jagan Antarvedi visit Live updates : తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక అంతర్వేది మహా క్షేత్రం శోభాయమానంగా వెలిగిపోతోంది. రథసప్తమి పర్వదినం ఒకవైపు, లక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం ప్రారంభోత్సవం మరోవైపుగా క్షేత్రం కనులవిందు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన రథానికి పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి రథాన్ని లాగి ప్రారంభోత్సవం చేశారు. కాగా, సీఎం జగన్ ఈ ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్ దగ్గర హెలిప్యాడ్‌కు చేరారు. 11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ తదితర కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని ప్రారంభించారు. అంతర్వేది పర్యటన అనంతరం 1.30కి తాడేపల్లికి తిరిగి చేరుకున్నారు జగన్.
ఇలా ఉండగా, గతేడాది సెప్టెంబర్ 5న అంతర్వేదిలో రథం దగ్ధమై, దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం స్పందించారు. కొత్త రథంతోనే ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపక్షాల ఆరోపణలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఈ కార్యక్రమం వెంటనే కార్యరూపం దాల్చేలా సెప్టెంబర్ 8న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. 95 లక్షల నిధులు మంజూరు చేశారు. స్వామి కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో పనులు వేగవంతగా పూర్తి చేశారు.
రథసప్తమి పురస్కరించుకుని భక్తులు ఆయా ఆలయ ఆవరణలోనే ప్రసాదాలు వండి స్వామివార్లకి సమర్పించుకుంటున్నారు. భారతదేశంలోనే వైష్ణవ సాంప్రదాయాల దేవాలయంగా తూర్పుగోదావరిజిల్లాలో ఉన్న గొల్లలమామిడాడ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈనెల 23వ తేదీన స్వామివారి కల్యాణం జరుగుతుందని. అనంతరం రథోత్సవం, గరుడ వాహనంలో స్వామివారి ఊరేగింపు, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం జరుగుతుందని సదరు ఆలయ కమిటీ తెలిపింది.
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వైష్ణవ సాంప్రదాయాలతో సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తున్నారు. దీంతో దేవాలయమంతటా ఉత్సవ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచీ భక్తులు క్యూ లైన్లలో నిల్చుని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. అంతకు ముందు అంతర్వేది ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు.. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని సీఎం వైయస్ జగన్ దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు.