సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ సతీసమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద NV రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం NV రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రీశుడికి అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈఓ సీజేఐ దంపతులకు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు.
అంతకుముందు VVIP అతిథి గృహం వద్ద CJI ఎన్‌వీ రమణకు మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డి, ఆలయ ఈవో గీతారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీజేఐ ఎన్వీ రమణ ప్రధానాలయ పునః నిర్మాణ పనులు వీక్షించారు. అనంతరం రింగ్‌రోడ్డు మార్గంలో ఉన్న టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్‌ను సందర్శించుకున్నారు.
ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు, ఆలయ నగరిని జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.