ప్రతి మనిషి జీవితంలో డబ్బుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే డబ్బుతో కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. డబ్బు గురించి పండితుడు, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడి తన నీతి శాస్త్రంలో అనేక విషయాలను చెప్పాడు. ఇంకా చెప్పాలంటే మనిషికి డబ్బే నిజమైన స్నేహితుడు.. కనుక ఎప్పుడూ డబ్బును పొదుపు చేయాలని సూచించాడు. పొదుపు చేసిన డబ్బు అవసరాల్లో నేను ఉన్నాను అంటూ ఆదుకుంటుంది. అంతేకాదు జీవితంలో డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నాడు. అందుకనే ఎవరైనా ధనవంతులు కావాలని కోరుకుంటే ఆచార్య చాణక్యుడి మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం ముఖ్యం. పురాణ గ్రంధాలతో సహా చాణక్య నీతిలో డబ్బు ప్రత్యేక ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో డబ్బు సంపాదించడం, ధనవంతుడు కావడం గురించి విలువైన సూచనలను వివరంగా వివరించాడు. వీటిని అనుసరించే వ్యక్తులు ఎన్నటికీ పేదలు కారు.
డబ్బుపై చాణక్యుడి విధానం
మీ సంపదను కాపాడుకోవడానికి మీ సంపాదనను ఖర్చు చేసే విధానం కూడా ముఖ్యం. ఖర్చు అనేది ధార్మిక కార్యకలాపాలను సూచిస్తుంది. దానం చేయడం వల్ల ధనం తరగదు. పైగా రెట్టింపు అవుతుంది. అంతేకాదు ప్రతి వ్యక్తి సంపాదన లో కొంత మొత్తం అయినా పొదుపు చేయడం కూడా చాలా ముఖ్యం. తద్వారా భవిష్యత్తులో అతనికి ఆర్ధిక కష్టాలు వస్తే.. ఎదుటి వారి సహాయం అర్దించే అవసరం ఏర్పడదు. డబ్బుల కోసం ఇబ్బందిని ఎదుర్కోరు.
దానం చేయడం, మతపరమైన కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేయడం ఎప్పటికీ అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది, అదేవిధంగా కష్ట సమయాల్లో డబ్బును ఆదా చేయడం పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. తద్వారా జీవితంలో డబ్బుకు కొరత ఉండదు.
అలాంటి డబ్బు జీవితాంతం ఆనందాన్ని ఇస్తుంది
డబ్బును ఎల్లప్పుడూ నైతికంగా, సరైన పద్ధతిలో సంపాదించినట్లయితే అది చాలా కాలం పాటు వ్యక్తితో ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కష్టపడి పని చేసి సంపాదిస్తే దాని ఫలాలు మీకే కాదు మీ కుటుంబానికి కూడా లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో కష్టపడి సంపాదించిన డబ్బు జీవితానికి ఆనందాన్ని శాంతిని తెస్తుంది.
అబద్ధం ఎంతకాలం నిలవదు. ఎందుకంటే అది త్వరలోనే వెలుగులోకి వస్తుంది, అదే విధంగా అనైతిక మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు త్వరలో బహిర్గతమవుతారు. దీని తరువాత అతను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేస్తాడు. అందుకే ఎల్లప్పుడూ కష్టపడి, నిజాయితీతో డబ్బులు సంపాదించమని చాణుక్యుడు పేర్కొన్నాడు.
అహాన్ని ఓడించండి, విలువలతో గెలవండి
సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగి ఉంటుంది. చాణక్యుడు ప్రకారం తమ సంపద గురించి గర్వపడే వారు త్వరగా పేదరికం బారిన పడతారు. విలువల ద్వారా అన్నీ గెలవవచ్చు .. అదే విధంగా గెలిచింది కూడా అహంతో పోగొట్టుకోవచ్చు అంటారు. అటువంటి పరిస్థితిలో వినయం, విలువలు, సంపద పట్ల గౌరవం మాత్రమే లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని తెస్తుంది.
అలాంటి డబ్బు చాలా కాలం పాటు ఉంటుంది
ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఎవరైనా సరే ఎల్లప్పుడూ నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాదించాలి. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తే అది ఎక్కువ కాలం ఉండదు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇబ్బందుల్లో పడతారు. అక్రమ సంపాదన ఖచ్చితంగా వారి నుంచి దూరం అవుతుంది. నిజాయితీగా కష్టపడి సంపాదించిన ఆస్తి, సంపద ఎల్లప్పుడూ ఒక వ్యక్తికి సహాయం చేస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు