కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. దేవరగట్టు కొండ ప్రాంతంలో వెలసిన మాల మల్లేశ్వరస్వామి చెంత జరుగుతున్న బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దసరా సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే బన్నీ ఉత్సవాన్నే కర్రల సమరంగా పేర్కొంటారు. ఈ కర్రల సమరంలో 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. స్వామి వారి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ఇరువర్గాల వారు కర్రలతో దాడులు చేసుకుంటారు. ఆలూరు సమీపంలోని మాల మల్లేశ్వరుల విగ్రహాల కోసం తలపడతారు. ఈ సమయంలో గ్రామస్థులు గాయపడతారు. ఒకొక్కసారి ప్రాణాలు పోయిన సందర్భంగా కూడా ఉంది. ఈ బన్ని ఉత్సవాన్నీ చూడడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భారీగా జనం హాజరవుతారు.
కర్రలతో తలపడే ఈ ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, రక్తపాతం జరగకుండా చూడడం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రక్తపాతం జరగకుండా .. ఉత్సవాలు జరపాలని పోలీసులు ఎన్నో ఏళ్ళనుంచి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ గ్రామస్థులు తమ సంప్రదాయంలో భాగమైన కర్రల సమరాన్ని మాత్రం వదిలేది లేదంటున్నారు.
దేవరగట్టు చుట్టూ దాదాపు 50 గ్రాములు ఉన్నాయి. అందులో నేరనికి, నెరనికి తండా, కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేకత చాటుకుంటారు ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి దీక్ష చేపట్టి కంకణ ధారణ మొదలు బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరనికి గ్రామానికి చేరేవరకు కట్టుబాట్లు పాటిస్తారు. 12 రోజులపాటు కనీసం కాళ్లకు చెప్పులు వేసుకోకుండా మద్యం మాంసం ముట్టకుండా పూర్తిగా బ్రహ్మచర్యం పాటిస్తారు.
అయితే పోలీసులు సీసీ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవంలో మద్యం తాగకూడదని పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అంతేకాదు కర్రలకు ఇనుప చువ్వలు, ఇనుప రింగులను ఉపయోగించవద్దని హెచ్చరించారు. ఉత్సవాలను పర్యవేక్షించడం కోసం సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పోలీసులతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా దేవరగట్టు వెళ్లి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలతో పాటు శానిటేషన్ పార్కింగ్ విద్యుత్ తాగునీరు వైద్యం తదితర సౌకర్యాలని అందుబాటులో ఉంచుతున్నట్లు చెబుతున్నారు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.
ఈ ఏడాది అయినా ఎటువంటి రక్తపాతం లేకుండా శాంతియుతంగా వ్యక్తిగత కక్షలకు తావు లేకుండా బన్నీ ఉత్సవం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..