కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరుగబోతోంది. దసరా రోజున అర్ధరాత్రి జరిగే కర్రల సమరాన్ని బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. హోలగుంద మండలం దేవరగట్టులో ఈ కర్రల సమరం జరగనుంది. శ్రీ మాళ మల్లేశ్వర స్వామి కల్యాణం తర్వాత.. కర్రల సమరం జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగానే.. ఇవాళ రాత్రి కర్రల సమరం జరగనుంది. దీనికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు పోలీసు ఉన్నతాధికారులు.
ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమ మద్యం రవాణాను నిర్మూలించేందుకు కర్నాటక బళ్ళారి జిల్లా నుంచి ఆలూరు వైపు వెళ్లే వాహనాల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అలాగే.. బన్నీ ఉత్సవంలో రింగులు తొడిగిన కర్రలను నియంత్రించేందుకు 13 గ్రామాల్లో ముమ్మర సోదాలు చేశారు. బన్నీ ఉత్సవాలకు కర్రలతో వచ్చే గ్రామాల్లో కర్రలతో హింస సాంప్రదాయం కాదంటూ.. పత్తికొండ DSP వెంకటరామయ్య, RDO భరత్‌నాయక్ ఆధ్వర్యంలో నేరిణికి, నేరిణికి కొత్తపేట, తండాలో హింస జరగకుండా అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ కర్రసమరానికి సుమారు 800 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 100 సీసీ కెమెరాలు, ఐదు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు.. ముందస్తు చర్యల్లో భాగంగా.. ఇప్పటికే వందలమందిని బైండోవర్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన నెరిణికి గ్రామంలో స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించిన వేదపండితులు, స్థానికులు.. 16న కొండ మీది నుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు నిర్వహించి దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ముగిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి . .