Bonalu Festival: బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు

తెలంగాణలో బోనాల సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో గోల్కోండ కోటలోని జగదాంబిక అమ్మవారికి అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ కోటకు రాజకీయ నేతలు, భక్తులు భారీగా క్యూ కట్టారు.

Bonalu Festival: బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు
Bonalu Festival 2025

Edited By: TV9 Telugu

Updated on: Jul 09, 2025 | 7:02 PM

తెలంగాణలో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి.. సల్లంగా చూడమని వేడుకుంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది కూడా బోనాల సంబురం మొదలు కాగా.. వచ్చే నెల 24న ముగుస్తాయి.

బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర ప్రారంభం నేపథ్యంలో తొలి బోనం సమర్పణకు వివిధ పార్టీల నేతలు, భక్తులు పెద్దయెత్తున తరలివచ్చారు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు.. ఎంపీ ఈటల రాజేందర్‌ బోనాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు విజయశాంతి, కవిత, బీజేపీ నేత మాధవీలత అమ్మవారికి బోనాలు సమర్పించారు. గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి బోనాలు సమర్పణకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఆషాడమాసంలో వచ్చే మొదటి గురువారం కానీ.. మొదటి ఆదివారం కానీ గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు. ఈ సారి ఆషాడ మాసంలో మొదటి గురువారం కావడంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవ విగ్రహాలు, పట్టు వస్త్రాలు, నజర్ బోనం, తొట్టెల, అమ్మవారి పీఠం గోల్కొండ ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకోగానే గోల్కొండ కోటలోని ప్రధాన ద్వారం దగ్గర కొబ్బరికాయలు కొట్టి బోనాలను లోపలికి ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండి

బోనాలు జాతర ప్రారంభంతో పోతురాజుల నృత్యాలు, శివ సత్తుల ఆటపాటలు, మేళ తాళాలతో గోల్కొండ కోట సందడిగా మారింది. మరోవైపు.. గోల్కొండలో బోనాల ప్రారంభంతో తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు షురూ అవుతాయి. ఆషాడమాసంలో రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు, ఆ తర్వాత.. పాతబస్తీలోని లాల్ దర్వాజ మహాకాళి బోనాలు కొనసాగుతాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..