AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి బోనమెత్తిన గోల్కొండ

డప్పుల మోత లేదు..శివసత్తుల పూనకాలు లేవు..పోతరాజుల సందడి ఉండదు... ఫలహారపు బండ్ల హంగామా కనిపించదు. ఆషాడ మాసంలో బోనాల సందడిలేక భాగ్యనగరం బోసిపోనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా ఈ ఏడాది బోనాల పండుగ నిరాడంబరంగా మొదలైంది.

తొలి బోనమెత్తిన గోల్కొండ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 5:59 PM

Share

డప్పుల మోత లేదు..శివసత్తుల పూనకాలు లేవు..పోతరాజుల సందడి ఉండదు… ఫలహారపు బండ్ల హంగామా కనిపించదు. ఆషాడ మాసంలో బోనాల సందడిలేక భాగ్యనగరం బోసిపోనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా ఈ ఏడాది బోనాల పండుగ నిరాడంబరంగా మొదలైంది. భక్తుల సందడి లేకపోయినా అమ్మవారికి ఏ లోటు లేకుండా బోనాల తొలి పూజను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు పూజారులు. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో మొదటి పూజతో తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ప్రతియేటా చారిత్రాత్మక గోల్కొండ కోటపై ఆషాఢమాసం బోనాల జాతర అత్యంత వైభవోపేతంగా జరుపడం ఆనవాయితీ. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు దేవాదాయ శాఖ అధికారులు గోల్కొండ బోనాల వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కేవలం 10 మందితోనే జగదాంబిక ఎల్లమ్మకు తొలిపూజ నిర్వహించారు. బోనాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు, పూజారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. సర్కార్‌ బోనాన్ని ఉత్సవ కమిటీ దేవాదాయ శాఖకు ఇస్తే, దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి పట్టు వస్త్రాలను ఆలయ పూజారి అనంతచారికి గోల్కొండలో అందజేశారు.

తెలంగాణలో ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ ఆలయం నుంచే ప్రారంభమవుతాయి. ఇక్కడ మొదటి పూజ 25వ తేదీ (గురువారం), 28న (ఆదివారం) రెండో పూజ, జూలై 2న (గురువారం) మూడో పూజ, 5న (ఆదివారం) నాలుగో పూజ, 9న (గురువారం) 5వ పూజ, 12న (ఆదివారం) ఆరో పూజ, 16న (గురువారం) ఏడో పూజ, 19న (ఆదివారం) ఎనిమిదో పూజ, 23న (గురువారం) తొమ్మిదో పూజను నిర్వహించనున్నారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల జాతర. తొలకరి పలకరింపులతో పాటు ఆషాఢ మాసంలో తెలంగాణకు బోనాల కళ వచ్చేస్తుంది. నగరాలు పల్లె కళను సంతరించుకుంటాయి. పచ్చని తోరణాలతో ప్రకృతిని ప్రతిబింబిస్తాయి. ఎటుచూసినా సాంప్రదాయమే ఉట్టిపడుతుంది. కట్టూబొట్టూ మారిపోతుంది. ఇంటిల్లిపాదిలో ఉత్సాహం ఉప్పొంగుతుంది. అయితే కరోనా కారణంగా భాగ్యనగర బోనం ఇంటి గడప దాటే పరిస్థితి లేదు. వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో లక్షలాది మంది ఒకేసారి పాల్గొనే ఈ ఆధ్యాత్మిక వేడుకలో భౌతిక దూరం పాటించడం అసాధ్యం. అందరూ ఒకేచోటకి చేరితే అనేక మందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం మందుస్తుగా బోనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎవరి ఇంట్లో వాళ్లు అమ్మవారి చిత్రపటాలకు బోనాలు సమర్పించి, దండం పెట్టుకోవడం క్షేమమని పూజారులు, పండితులు సూచిస్తున్నారు.

ప్రకృతిని మనం తల్లితో పోల్చుకుని ఆరాధిస్తాం. అందరినీ కాపాడమని వేడుకుంటాం. కానీ అమ్మ ఆగ్రహిస్తే ప్రకృతి విపత్తులు వస్తాయి. 1869 లో ఇదే జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోయారు. దీంతో అమ్మవారిని శాంతింపచేయడానికి ఏడాది అంతా భోజనం పెట్టే ఆ తల్లికి మనమందరమూ కలిసి భోజనం పెట్టి తమను కాపాడవలసిందిగా వేడుకోవాలని పెద్దలు నిర్ణయించుకున్నారట. కాలక్రమంలో ఈ భోజనమే ‘ బోనం’గా మారింది.

బోనాల పండుగ ప్రకృతి ఆరాధనా ఉత్సవం. వానా కాలంలో ప్రజల్ని ఆదుకోవాలనే నేపథ్యంలో వరుణుడు, దుర్గామాతల కోసం ఈ ఉత్సవాలు జరుగుతాయి. విపత్తులు, వ్యాధులు సంభవించే అవకాశం ఈ కాలంలో అధికంగా ఉంటుంది. ఈ కాలంలో తమని సల్లంగా చూడాలంటూ భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఈసారి కూడా కరోనా మహమ్మారి నుంచి నుంచి కాపాడాలని వేడుకుంటూ మనమంతా అమ్మవారికి బోనం సమర్పిద్దాం.