Sankranti: వందేళ్లుగా భోగి పండుగకు ఆ రెండు గ్రామాలు దూరం .. బసవన్న మృతితో చలించిన గ్రామస్థులు

| Edited By: TV9 Telugu

Jan 16, 2024 | 1:12 PM

హిందూ పండగల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న భోగి పండుగకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల వారు సుమారు గత వందేళ్ల నుండి దూరంగా ఉంటూ వస్తున్నారు. దశాబ్దాల క్రితం భోగి మంటలు వేసే సమయంలో చోటు చేసుకున్న అపశ్రుతుల వల్ల ఈ భోగి పండుగకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు గ్రామస్తులు. ముఖ్యంగా జియ్యమ్మవలస మండలంలోని బాసంగి, కొమరాడ మండలంలోని కళ్లికోటలో ఈ భోగి పండుగను జరుపుకోవడం లేదు.

Sankranti: వందేళ్లుగా భోగి పండుగకు ఆ రెండు గ్రామాలు దూరం .. బసవన్న మృతితో చలించిన గ్రామస్థులు
Special Villages In Ap
Follow us on

సంక్రాంతి పండగ అంటే హిందువుల పెద్ద పండుగ. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు జరిగే భోగి పండుగ ఒక స్పెషల్. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అందరూ భోగి పండుగకు వారం రోజుల ముందు నుండే ఆవు పేడను రెడీ చేసుకుని పిడకల దండలు తయారు చేయడంలో నిమగ్నమవుతారు. ఎండిన చెట్లు కొట్టి, భోగి మంటలు వేయటానికి కలపను కూడా సిద్ధం చేస్తారు. అర్ధరాత్రి నుండి భోగిమంటల ఏర్పాట్ల కోసం ఊరంతా ఏకమవుతారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి భోగిమంటల్లో పిడకల దండలు వేసి. సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ ఆనందంగా గడుపుతారు.

భోగి పండుగ రోజు చిన్నారులకు భోగి పళ్లు కూడా పోస్తారు. భోగి రోజు చిన్నారులకు భోగి పళ్లు పోస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, విద్యాభివృద్ధి జరుగుతుందని, స్వచ్ఛమైన మాటలు వస్తాయని పెద్దల విశ్వాసం. అందువల్ల సంక్రాంతి రోజు భోగిపళ్లకు విశిష్ట ప్రాధాన్యత ఇస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న భోగి పండుగకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల వారు సుమారు గత వందేళ్ల నుండి దూరంగా ఉంటూ వస్తున్నారు.

దశాబ్దాల క్రితం భోగి మంటలు వేసే సమయంలో చోటు చేసుకున్న అపశ్రుతుల వల్ల ఈ భోగి పండుగకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు గ్రామస్తులు. ముఖ్యంగా జియ్యమ్మవలస మండలంలోని బాసంగి, కొమరాడ మండలంలోని కళ్లికోటలో ఈ భోగి పండుగను జరుపుకోవడం లేదు. సుమారు వందేళ్ల క్రితం బాసంగిలో జరిగిన భోగిమంటలో గ్రామస్తులు సింహాద్రి అప్పన్న గా భావించే ఎద్దుకు మంటలు అంటుకొని మృత్యువాత పడింది. అదే సంవత్సరం ఆ గ్రామంలో అనేక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో దైవ స్వరూపంగా భావించిన బసవన్న మృతితోనే ఇంతటి అనర్థం జరిగిందని భావించారు.

ఇవి కూడా చదవండి

అప్పటి నుండి ఆ గ్రామస్తులు భోగి పండుగకు దూరంగా ఉంటున్నారు. అలాగే కళ్లికోటలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. భోగిమంటలు ప్రారంభమైన తరువాత మంటలకు సమీపంలో ఉన్న రెండు పశువులు కట్టేసిన త్రాళ్లను తెంచుకొని మరీ పరుగులు తీసి మంటల్లో దూకాయి. ఆ ప్రమాదంలో రెండు పశువులు మరణించాయి. అప్పటినుండి భోగి పండుగ జరుపుకోవడం గ్రామానికి అరిష్టంగా భావిస్తూ ఆ గ్రామస్తులు కూడా భోగికి దూరంగా ఉంటున్నారు.

వివిధ సందర్భాల్లో జరిగిన విషాదకర ఘటనలతో భోగి పండుగ జరుపుకోకూడదని గ్రామస్తులంతా ఏకమై తీర్మానం చేసుకున్నారు. దీంతో ఈ గ్రామాలన్నీ తరతరాలుగా భోగి పండుగ జరుపుకోవడం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుత యువత మాత్రం పలు గ్రామాల్లో భోగి పండుగ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నప్పటికీ గ్రామ పెద్దలు వారిని సముదాయిస్తూ గ్రామ సంక్షేమం కోసం తమ నిర్ణయాన్ని పాటించాలని కోరుతున్నారు. దీంతో యువత సైతం భోగి పండుగకు దూరంగా ఉండక తప్పడం లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..