అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గాల నుంచి శ్రీహరి దర్శనం కోసం తిరుమలకు కాలి నడకన వెళ్ళాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది తిరుమల ది. ఈ మధ్య కాలంలో భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు కావడంపై టీటీడీ అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదంటోంది టీటీడీ. ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదని టీటీడీ చెబుతోంది. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తోంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉందని ప్రకటన లో పేర్కొంది టీటీడీ.
భక్తులు తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న టీటీడీ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చని టీటీడీ చెబుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గం లోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని టీటీడీ సూచిస్తోంది. తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం పొందవచ్చన్న టీటీడీ భక్తులకు తెలియజేస్తోంది. దీర్ఘకాలిక కిడ్ని వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొంది టీటీడీ. తిరుమలకు కాలినడకన రాదలచిన భక్తులు తప్పనిసరిగా సూచనలు పాటించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..