ప్రతి ఒక్కరూ నిద్ర పోయే సమయంలో ఎన్నో రకాల కలలు కంటుంటారు. కొన్ని కలలు మంచివి అయితే కొన్ని కలలు భయపెడతాయి కూడా. అంతేకాదు కొన్ని సార్లు నిద్ర నుంచి మేలు కున్న తర్వాత గుర్తుండవు. అయితే కొన్నిసార్లు కలలు మన భవిష్యత్తును సూచిస్తాయని స్వప్న శాస్త్రంలో పేర్కొంది. ప్రతి కల వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం దాగి ఉంటుందని సూచిస్తోంది. కొన్ని సార్లు కలలో రకరకాల జంతువులు కనిపిస్తాయి. అలా మీరు కనుక కలలో ఆవును చూడడం జరిగితే .. ఆ ఆవు కనిపించే విధానం బట్టి మీ జీవితంలో జరిగే మంచి చెడులను గుర్తించవచ్చు అట.. సర్వ సాధారణంగా గోమాత కలలో కనిపిస్తే అన్ని పనులలో త్వరలో విజయం సాధిస్తారని అర్థం.
హిందూ మతంలో ఆవుని గోమాతగా గౌరవిస్తారు. పూజిస్తారు. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని విశ్వాసం. అందుకే జంతువులలో ఆవు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం గోమాత లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. మీ కలలో మీకు ఆవు కనిపిస్తే దాని అర్థం ఏమిటి అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. ఈ రోజు ఆ ప్రశ్నలకు అర్ధం తెలుసుకుందాం..
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవును చూడటం మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. రాబోయే జీవితంలో మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారని అర్థం. సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
అదే సమయంలో కలలో దూడ కనిపిస్తే, ఈ కల కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. అంతేకాదు ఏ పని చేపట్టినా.. మీ చేతుల మీదుగా ఏ పని చేసినా విజయం సాధిస్తారు.
కలలో ఆవుకు ఆహరం తినిపిస్తున్నట్లు కనిపిస్తే ఈ కల కూడా చాలా మంచిది. స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కల మీ దీర్ఘాయువును సూచిస్తుంది. మీ ఆరోగ్యం లేదా మీ కుటుంబంలోని ఎవరికైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే.. వారి ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడుతుందట.
కలలో ఆవుల మందను చూసినట్లు అయితే త్వరలో మీకు చాలా డబ్బు వస్తుంది. వ్యాపారం పురోగమిస్తుంది. డ్రీమ్ థీరీ ప్రకారం ఇలాంటి కలకంటే మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్ధమట.
కలలో ఆవు చనిపోయినట్లు కనిపిస్తే.. కలల సైన్స్ ప్రకారం ఈ కల చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల కనుక ఎవరికైనా వస్తే.. వారు భవిష్యత్తులో చాలా నష్టాన్ని చవిచూడబోతున్నారని .. జీవితంలో అనేక సమస్యలు తలెత్తవచ్చని అర్థమట.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు