Medaram Maha Jatara: మేడారం మహాజాతర నిర్వహణ బాధ్యతలన్నీ ఆ ఇద్దరు మహిళా మంత్రులకే..!

| Edited By: TV9 Telugu

Dec 19, 2023 | 7:52 PM

ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర.. కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం మేడారం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై కొత్త సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. స్థానిక ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే జిల్లాకు చెందిన సురేఖకు దేవాదాయ మంత్రి పదవి దక్కడంతో ఆ ఇద్దరు ఆడబిడ్డలు జాతరపై మరింత ఫోకస్ పెట్టారు.

Medaram Maha Jatara: మేడారం మహాజాతర నిర్వహణ బాధ్యతలన్నీ ఆ ఇద్దరు మహిళా మంత్రులకే..!
Medaram Jatara
Follow us on

ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర.. కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం మేడారం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై కొత్త సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. స్థానిక ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే జిల్లాకు చెందిన సురేఖకు దేవాదాయ మంత్రి పదవి దక్కడంతో ఆ ఇద్దరు ఆడబిడ్డలు జాతరపై మరింత ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్ల నిధులు కేటాయించింది. ఈసారి జాతరకు రూ. వంద కోట్లగా పైగా ఖర్చుతో ఘనంగా జరిపించాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. 2024 మహా జాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు..? తెలంగాణ కుంభమేళ ప్రత్యేకతలు ఏంటి..? ఒకసారి చూద్దాం..!

మేడారం అభయ అరణ్యం జనారణ్యంగా మారే సమయం ఆసన్నమైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి తరలించే జనంతో కుంభమేళాను తలిపిస్తుందీ మహా జాతర.

స్వరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నియోజకవర్గం నుండి గెలిచిన సీతక్క మంత్రి హోదాలో తొలిసారి జాతర నిర్వహించబోతున్నారు. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయశాఖ మంత్రి హోదాలో మొదటిసారి ఈ మహాజాతరను పర్యవేక్షించనున్నారు.

మేడారం మహా జాతరకు తేదీలు ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గత జాతర అనుభవాలు, నూతనంగా చేపట్టే శాశ్వత నిర్మాణాలు, మౌలిక సౌకర్యాల కల్పన, మరమ్మతులను బేరీజు వేసుకుంటూ, రూ. 75 కోట్లతో నివేదిక పంపారు. వాటిలో ఆర్‌ అండ్‌ బీ శాఖకు రూ. 2.80 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.4.35 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.6.11 కోట్లు, గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్‌ శాఖకు రూ.8.28 కోట్లు, గ్రామీణ నీటిపారుదల శాఖకు రూ.14.74 కోట్లు, జిల్లా పంచాయతీ రాజ్ శాఖకు రూ.7.84 కోట్లు, ఐటీడీఏ గిరిజనాభివృద్ధి శాఖకు రూ.4 కోట్లు, సమాచార పౌరసంబంధాల శాఖకు రూ.50 లక్షలు, వైద్య ఆరోగ్యశాఖకు రూ.కోటి, పోలీసు శాఖకు రూ.10.50 లక్షలు, రెవెన్యూ శాఖకు రూ.5.25 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.1.50 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.3.96 కోట్లు, రవాణా శాఖ (టీఎస్‌- ఆర్టీసీ)కు 2.25 కోట్ల తో వివిధ శాఖలకు ఈ నిధులు కేటాయించారు..

అయితే జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదలకు మేడారం చిన్నాభిన్నమైంది. జంపన్న వాగు వరద సమ్మక్క, సారలమ్మ గద్దెలను తాకుతూ ప్రవహించింది. దీంతో రెడ్డిగూడెం, ఊరట్టం, మేడారం, కొత్తూరు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. జంపన్నవాగు ఒడ్డుపై నిర్మించిన కల్యాణ కట్టలు, సులభ్‌ కాంప్లెక్సులు, మేడారం చుట్టుపక్కల, అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు కొట్టుకుపోయాయి. ఆ వరదలు వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో జాతర పనులను పరుగులు పెట్టిస్తున్న మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతరకు పది రోజుల ముందే అభివృద్ది పనులన్నీ పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఆదేశించారు..

జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సమన్వయంతో గత జాతర కంటే వైభవంగా ఈసారి జాతర నిర్వహిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క మంత్రవడంతో ఆమెకు మరిన్ని బాధ్యతలు పెరిగాయి. మంత్రిగా స్వీకరించిన తర్వాత సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్న సీతక్క అధికారుల కు పలు సూచనలు చేశారు

ఈసారి జాతరకు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు. ఐదు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాకంటే జాతర నిర్వహణలో పోలీసుల పాత్రే చాలా కీలకం. ఈసారి మావోయిస్టు యాక్షన్ టీమ్‌తో ముప్పు ఉన్న నేపథ్యంలో ములుగు SP గౌస్ ఆలం నేతృత్వంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక మహాజాతరకు ఇంకా కొద్ది రోజుల గడువు మాత్రమే ఉంది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క తన ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మ జాతరను మహా వైభవంగా జరిపించడం ద్వారా మొక్కు చెల్లించు కోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మేడారం పూజారులు మాత్రం పూర్తిగా సీతక్క పైనే భారం వేశారు. అంతా ఆమె చూసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…