Medaram Maha Jathara: సామూహికంగా వదిలి కదులుతున్న జనం.. నిర్మానుష్యంగా ఏజెన్సీ గ్రామాలు..!

మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు అసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి. అతి పెద్ద గిరిజన జాతర ప్రారంభం అవడంతో మేడారానికి క్యూ కట్టారు జనం. అమ్మ బైలెల్లినం అంటూ సమ్మక - సారలమ్మల గద్దెల వైపు భక్తుల అడుగులు వేస్తున్నారు. పల్లెటూర్లలో పండుగ వాతావరణం నెలకొంది.

Medaram Maha Jathara: సామూహికంగా వదిలి కదులుతున్న జనం.. నిర్మానుష్యంగా ఏజెన్సీ గ్రామాలు..!
Medaram Maha Jathara

Edited By: Balaraju Goud

Updated on: Feb 20, 2024 | 5:10 PM

మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు అసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి. అతి పెద్ద గిరిజన జాతర ప్రారంభం అవడంతో మేడారానికి క్యూ కట్టారు జనం. అమ్మ బైలెల్లినం అంటూ సమ్మక – సారలమ్మల గద్దెల వైపు భక్తుల అడుగులు వేస్తున్నారు. పల్లెటూర్లలో పండుగ వాతావరణం నెలకొంది. సామూహికంగా ఊర్లకు ఊర్లే ఖాళీ చేసి బయలుదేరుతున్న జనం. దీంతో నిర్మానుషంగా మారుతున్నాయి గ్రామాలు..

వనం జనంతో నిండిపోతోంది. ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జనగుడారంగా మారి పోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘ శుద్ధ మంచి ఘడియలు వచ్చేశాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబయింది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు. ఇక 22వ తేదీన సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది.

సమ్మక్క, సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు బయలుదేరుతున్నారు. గిరిజనల ఆరాధ్య దేవతలుగా కొలిచే సమ్మక్క – సారలమ్మను దర్శించుకునేందుకు ఆ తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షల మంది భక్తులు మేడారానికి తరలివెళ్తుంటారు. ఈ క్రమంలోనే భక్తుల రవాణాకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా, మరోవైపు జనం జాతరకు వెళ్లేందుకు తమకున్న వాహనాలు ద్వారా మేడారం వెళ్లేందుకు ప్రయాణం మొదలుపెట్టారు.

ఐదు రోజులపాటు జరిగే గిరిజన జాతరలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడమే కాక, ఆ తల్లి దీవెనలు అందుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లోని ప్రజలు మేడారం వైపు అడుగులు వేస్తున్నారు, కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం నైవేద్యంగా చెల్లించి తల్లుల దీవెనలు తీసుకునేందుకు మేడారం అడవులకు కుటుంబ సమేతంగా బయలుదేరాయి తెలంగాణ పల్లెలు..
మేడారంలో దేవతలకు మొక్కులు చెల్లించుకోవడంతో పాటు తమ కుటుంబాలతో ఐదు రోజులపాటు ఆటవిడుపుగా గడిపేందుకు ప్రకృతితో సహజీవనం చేసేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంతో బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శివసత్తుల పూనకాలు, డోలు సన్నాయిలతో జనం కులాలకతీతంగా తమకున్న ట్రాక్టర్లు , ఆటోల ద్వారా మేడారం బయలుదేరుతుండడంతో గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ప్రజలంతా మేడారం వైపు అడుగులు వేస్తుండడంతో గ్రామాలు నిర్మానుషంగా మారాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…