యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉద్యోగుల ప్రక్షాళన ప్రారంభమైంది. ఆలయంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన 26 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. యాదాద్రి నుంచి రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు ఉద్యోగులను బదిలీ చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో సాధారణ బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్జేసీ(6ఎ), డీసీ (6బి), ఏసీ (6సి) హోదా కలిగిన దేవాలయాలకు చెందిన ఉద్యోగులలో ఒకే చోట నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిలో 40 శాతం వరకే స్థానచలనం కలిగించాలన్నదే దేవాదాయశాఖ యోచన. ఇందులో భాగంగానే ప్రముఖ ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేయడంతో అవినీతి, అక్రమాల ఆరోపణలను కొందరు ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆలయాల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేస్తే అవినీతి, అక్రమాలను రూపుమాపవచ్చని సర్కారు బదిలీల ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్జేసీ హోదా గల యాదాద్రి, భద్రాచలం, వేములవాడ ఆలయాల ఉద్యోగులు బదిలీ అయ్యారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి 65 మంది ఉద్యోగులు కౌన్సిలింగ్ కు హాజరు కాగా, 26 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు.
13 ఏళ్ల తర్వాత దేవాదాయ శాఖలో బదిలీలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఉన్న సమయంలో కొమురవెల్లి ఆలయం నుంచి యాదాద్రి, వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర తదితర ఆలయాలకు ఉద్యోగులు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వహించిన ఉద్యోగులు ఇక్కడికి వచ్చారు. అప్పట్లో జరిగిన బదిలీలు తప్ప మరోసారి ట్రాన్స్‌పర్లు లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు జరిగిన బదిలీల్లో ఇద్దరు ఏఈవోలు, ఆరుగురు సూపరింటెండెంట్లు, ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక సివిల్ ఇంజినీర్ డీఈ, ఒక ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నారు.
యాదాద్రి ఆలయంలో చివరిసారిగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బదిలీలు జరిగాయి. అప్పటి నుంచి యాదాద్రి ఆలయంలో ఇప్పటివరకు బదిలీలు జరగలేదు. చాలా మంది అధికారులకు, పలు విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు లభించి యాదగిరిగుట్టలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా బదిలీలు జరిగాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..