నరసాపురం వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 15 మంది సభ్యులున్న ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. వారిలో ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఉన్నారు. ఈ కమిటీ పార్లమెంటు నియమాలు, నిబంధనలు, సబ్-రూల్స్, బై లాస్ తదితర అంశాలను పరిశీలించి సభకు నివేదించాలి. అలాగే రాజ్యాంగం లేదా పార్లమెంటు ప్రతిపాదించిన ప్రతినిధుల పరిధిలోని పనుల అమలు సక్రమంగా జరుగుతున్నాయో లేదా కూడా పరిశీలించాలి.
ఇక పార్లమెంటు లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌గా కూడా నామా నాగేశ్వరరావును నియమించగా.. అందులో అధ్యక్షుడితో కలిపి 9 మంది సభ్యులుంటారు. స్పీకర్ సూచనతో లైబ్రరీకి సంబంధించిన విషయాలను పరిశీలించి, సలహా ఇవ్వడం, లైబ్రరీ మెరుగుపరచడానికి సూచనలు చేయడం, లైబ్రరీ సేవలను పూర్తిగా ఉభయ సభల సభ్యులు సక్రమంగా వినియోగించుకోవడంలో వీరు సహాయం చేస్తుంటారు.