
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. కుట్రలు, కుతంత్రాలు, చౌకబారు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అంటూ ఆమె విమర్శించారు. మంగళవారం లక్ష్మీపార్వతి విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. పరిపాలనలో తిరుగులేని నాయకుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు.. చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా.. పదే పదే ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం ఆయన డొల్లతనానికి నిదర్శనమన్నారు. ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయిన చరిత్ర చంద్రబాబుదని లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందని, 130 సీట్లు గెలిచి జగన్ సీఎం అవడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. స్వచ్చందంగా సినీ రంగం అంతా జగన్‌కు అండగా నిలవడం అభినందనీయమని లక్ష్మీ పార్వతి అన్నారు.