TRS Group War in Palair Assembly constituency: ఖమ్మం జిల్లాలోని గులాబీ పార్టీలో ముసలం నెలకొంది. జిల్లాతోపాటు పాలేరులో రాజకీయం నిత్యం చర్చనీయాంశంగా మారుతోంది. నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల వర్సెస్ కందాల ఎపిసోడ్ రోజురోజుకీ హీటెక్కుతోంది. వర్గపోరు మరింత ముదిరింది. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. అటు మరింత దూకుడుగా వెళ్తున్నారు ఎమ్మెల్యే కాందాల ఉపేందర్‌రెడ్డి. ఒకరిపై ఒకరు పరోక్షంగా కౌంటర్లు వేసుకుంటున్నారు. దీంతో కిందిస్థాయి కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. 2018 వరకు పరిస్థితి బాగానే ఉంది. అంతా తుమ్మల కనుసన్నల్లోనే జరిగేది. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. 2018 ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో తుమ్మల ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కందాల గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.. అదిగో అప్పటి నుంచే మొదలైంది అసలు వార్. అప్పటికే కత్తులు దూసుకుంటున్న రెండు వర్గాల మధ్య రైతు సమన్వయ కమిటీలు చిచ్చురేపాయి.. తుమ్మల అనుచరులను తొలగించడంతో గొడవలు తారస్థాయికి చేరాయి.
ఈ మధ్య ఫ్లెక్సీ వార్ కూడా అగ్గిరాజేసింది. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రోటోకాల్ పాటించలేదని తుమ్మల వర్గం అగ్గిమీద గుగ్గిలం అయింది. అటు ఫ్లెక్సీని చించారంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది కందాల వర్గం. ఇలా సై అంటే సై అంటున్నాయి ఇరు వర్గాలు. అటు పాలేరులో విస్తృతంగా పర్యటిస్తున్నారు తుమ్మల. ప్రజలు, కార్యకర్తలకు ఎప్పడూ అండగా ఉంటానని చెప్పారు.
మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ సైతం స్పీడ్ పెంచారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పాలేరు టికెట్ దక్కించుకునేందుకు తుమ్మల ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. సీఎం కేసీఆర్‌కు తుమ్మల అత్యంత సన్నిహితుడిగా ఉండటం.. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసి వచ్చే అంశం. మరి సీఎం కేసీఆర్ ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరం. ప్రస్తుతానికైతే..అటు తుమ్మ, ఇటు కందాల ఎవరూ తగ్గడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం జరగడం ఖాయమన్న టాక్ నడుస్తోంది.
Also Read: