స్వాతంత్ర్యం కావాలన్నప్పుడు కాంగ్రెస్ తెచ్చింది.. అలాగే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చిందని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. APలో చచ్చిపోయి.. తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసిందన్నారు. అసాధారణంగా పెరిగిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ శుక్రవారం ఛలో రాజ్ భవన్‌కు పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… భూమ్మీద ఈ స్థాయిలో పెట్రో ధరలు మరే దేశంలో లేవన్నారు. చివరికి పాకిస్తాన్‌లో కూడా పెట్రోల్ ధర 53 రూపాయలని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కార్యర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సాయంత్రం 5 గంటల తర్వాత విడిచిపెడతామని చెబుతున్నారని పోలీసుల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని.. ఈ రకమైన అరెస్టులు చేసి పోలీసులతో పరిపాలన చేయాలని ప్రభుత్వం అనుకుంటే తీవ్రమైన పరిణామలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.
అధికారులు ముఖ్యమంత్రి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తే.. ఎవరినీ వదిలిపెట్టమని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐజీ ఇంటిలిజెన్స్ ప్రభాకరరావు తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ తాము చేస్తున్న కార్యక్రమం ప్రజల కోసమని చెప్పారు.
7 ఏళ్లలో 36 లక్షల కోట్లు పెట్రోల్, డీజిల్ పేరిట నరేంద్ర మోదీ దోచుకున్నారు. 40 రూపాయల పెట్రోల్‌కు 65 రూపాయల పన్ను వసూలు చేస్తున్నారని, అలాగే డీజీల్, గ్యాస్‌పై అధిక ధరలు వసూలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.