Tirupati Parliament: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో గుర్తుల కేటాయింపు మిత్రపక్షాలకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీకి గ్లాస్ టెన్షన్ పట్టుకుంది. మిత్రపక్షమైన జనసేన గుర్తు… మరో పార్టీకి రావడంతో ఓట్లు చీలతాయన్న గుబులుతో ఉంది.
తిరుపతిలో బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల గుర్తు కమలం. జనసేన పోటీ చేయడం లేదు కాబట్టి… ఆ పార్టీ ఓట్లన్నీ తమకే పడతాయని అంచనా వేసుకుంది బీజేపీ. తిరుపతిలో జనసేన ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంతో చెప్పుకోదగ్గ ఓట్లే వస్తాయని భావించింది. పవన్ కల్యాణ్ రోడ్‌షో సక్సెస్ కావడంతో ఓట్లు బాగానే వస్తాయన్న ధీమాతో ఉంది.
అనూహ్యంగా నవతరం పార్టీకి గ్లాస్ గుర్తు రావడం బీజేపీ, జనసేనను టెన్షన్‌లో పడేసింది. గతంలో జనసేనకు గ్లాస్ గుర్తు వచ్చినా… ఈసీ గుర్తింపు లేదు. 2019 ఎన్నికల్లో BSP, వామపక్షాలతో కలిసి జనసేన పోటీ చేసింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా ఆ పార్టీకి కేటాయించింది. అప్పుడు పోలైన ఓట్లలో కనీసం 6 శాతం కూడా జనసేనకు రాలేదు. ఆ కారణంగా ఈసీ గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. దాంతో గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీ అభ్యర్ధి రమేష్‌కుమార్‌కి కేటాయించింది ఈసీ.
ఇదంతా వైసీపీ కుట్ర అని అటు బీజేపీ, ఇటు జనసేన ఆరోపిస్తున్నాయి. కచ్చితంగా గ్లాస్ గుర్తు రద్దవుతుందని చెబుతున్నాయి. ఈ గుర్తుల గోలలో అనూహ్యంగా నవతరం పార్టీ ఒక్కసారిగా ఫేమస్ అయింది. అసలు ఆ పార్టీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల నుంచి అన్ని పార్టీలూ దాని గురించే మాట్లాడుకునే స్థితి వచ్చింది. మిత్రపక్షాలు రెండూ టార్గెట్ చేయడంతో అలర్ట్ అయింది నవతరం పార్టీ. తమ అభ్యర్థి రమేష్‌కుమార్‌కు ప్రాణహాని ఉందని ఆరోపిస్తోంది. బీజేపీ నేతలు తమ అభ్యర్థిపై దాడి చేయించడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు నవతరం అధ్యక్షుడు రావు సుబ్రహ్యణ్యం.
పార్టీల సంగతెలా ఉన్నా… ఇప్పుడు జనం ఓట్లే కీలకం. నవతరం పార్టీకి గ్లాస్ గుర్తయితే వచ్చేసింది. ఎవరైనా BJP-జనసేన మద్దతుదారులు కన్ఫ్యూజ్ అయి గ్లాస్ గుర్తుకి ఓట్లేస్తే కమలానికి షాక్ తప్పదు. గ్లాస్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉందనేది తెలియాలంటే మే 2 వరకు ఆగాల్సిందే.