Tirupati by-election 2021: తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఓట్ల లెక్కింపు మే2న జరుగుతుంది. ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనాతో చనిపోవడంతో తిరుపతి సీటు ఖాళీ అయింది. ఈసారి ఎన్నికల కోసం వైసీపీ పక్షాన గురుమూర్తి , టీడీపీ పక్షాన పనబాక లక్ష్మీ, బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ చింతామోహన్ బరిలో ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికకు ఆర్వోగా నెల్లూరు కలెక్టర్ చక్రధర్‌బాబు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలతో పాటే ఈ ఎన్నిక ఫలితాలు కూడా ప్రకటిస్తారు. తిరుపతి ఎంపీ పరిధిలోకి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, సూళ్ళూరుపేట, సర్వేపల్లి, వెంకటగిరి మొత్తం 7అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. వీటిలో సత్యవేడు, గూడూరు, సూళ్ళురుపేట నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు. ఈ ఏడు చోట్లా ప్రస్తుతం అధికార వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 17,02,084 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 8,34,247 కాగా, మహిళా ఓటర్లు 8,67,586 మంది. ఇక ఇతరులు 251 మంది ఉన్నారు. వీరిలో చిత్తూరు జిల్లాలో 7,35,059 మంది, నెల్లూరు జిల్లాలో 9,67,025 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,993 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుంది.
అభ్యర్థుల పూర్తి వివరాలివే..
వైసీపీ అభ్యర్ధి – డా. గురుమూర్తి : డాక్టర్ గురుమూర్తి ఆర్థోపెడిక్ డాక్టర్. జగన్ పార్టీ పెట్టినప్పటినుంచీ జగన్ వెంటే డాక్టర్ గురుమూర్తి ఉన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో ఫిజియోథెరపిస్టుగా సేవలు అందించి జగన్ దృష్టిలో పడ్డారు డాక్టర్ గురుమూర్తి. షర్మిల పాదయాత్రలో కూడా ఆయనే వైద్య సేవలు అందించారు. దివంగత సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఇప్పటికే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో.. డాక్టర్ గురుమూర్తికి ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ 7గురు మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు.
టీడీపీ అభ్యర్ధి – పనబాక లక్ష్మి: టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి (63 సం.) స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. ఆమె భర్త పనబాక కృష్ణయ్య ఇండియన్ రైల్వే సర్వీసుకు చెందిన రిటైర్డు అధికారి. 1996,1998, 2004 లలో కాంగ్రెసు పార్టీ తరపున నెల్లూరు నుంచి పనబాక లక్ష్మి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలకు మందు టీడీపీలో చేరి తిరుపతి నుంచీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పనబాక లక్ష్మి తరపున స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, సీనియర్ నాయకులు ముమ్మర ప్రచారం చేశారు.
బీజేపీ అభ్యర్ధి – రత్నప్రభ: ఇక్కడ విశ్రాంత ఐఏఎస్ రత్నప్రభ ను పోటీలో నిలిపింది బీజేపీ. బీజేపీ అధ్యక్షుడు నడ్డా సహా అనేకమంది జాతీయ నేతలు బీజేపీ తరఫున ప్రచారం చేశారు. జనసేన తరపున మద్దతుగా పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. రత్నప్రభ భర్త ఎ. విద్యాసాగర్ ఏపీ కేడర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి. రత్నప్రభ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కర్ణాటక కేడర్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. వైఎస్ హయాంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా రత్నప్రభ పనిచేశారు. జగన్ ఆస్తుల కేసులో రత్నప్రభ కూడా ఇరుక్కున్నారు. తరువాత తన సొంత కేడర్ కర్ణాటకకు వెళ్లిపోయి, 2018 జూన్ లో పదవీ విరమణ చేశారు. 2019లో బీజేపీలో చేరారు రత్నప్రభ.
2019లో జరిగిన తిరుపతి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూస్తే…
విజేత: బల్లి దుర్గా ప్రసాదర్ రావు, వైకాపా,-7,22,877 ఓట్లు, 55.03 శాతం
పనబాక లక్ష్మీ, టీడీపీ-4,94,501 ఓట్లు, 37.65 శాతం
నోటాకు-25,781 ఓట్లు, 1.96 శాతం
చింతా మోహన్, కాంగ్రెస్- 24,039 ఓట్లు, 1.83 శాతం
డి. శ్రీహరిరావు, బీఎస్పీ-20,971 ఓట్లు, 1.60 శాతం
బొమ్మి శ్రీహరిరావు, బీజేపీ-16,125 ఓట్లు, 1.22 శాతం
విజేత మెజార్టీ-2,28,376 ఓట్లు, ఓట్ల తేడా 17.38 శాతం
తిరుపతి లోక్‌సభకు ఇప్పటివరకూ ఎన్నికైన వారు వీరే!
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 మాడభూషి అనంతశయనం అయ్యం కాంగ్రెస్
రెండవ 1957-62 మాడభూమి అనంత శయనం అయ్యం కాంగ్రెస్
మూడవ 1962-67 సి.దాస్ కాంగ్రెస్
నాలుగవ 1967-71 సి.దాస్ కాంగ్రెస్
ఐదవ 1971-77 టి.బాలకృష్ణయ్య కాంగ్రెస్
ఆరవ 1977-80 టి.బాలకృష్ణయ్య కాంగ్రెస్
ఏడవ 1980-84 పసల పెంచలయ్య కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 చింతా మోహన్ తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 చింతా మోహన్ కాంగ్రెస్
పదవ 1991-96 చింతా మోహన్ కాంగ్రెస్
పదకొండవ 1996-98 నెలవల సుబ్రహ్మణ్యం కాంగ్రెస్
పన్నెండవ 1998-99 చింతా మోహన్ తెలుగుదేశం పార్టీ
పదమూడవ 1999-04 నందిపాకు వెంకటస్వామి బీజేపీ
పద్నాలుగవ 2004-09 చింతా మోహన్ కాంగ్రెస్
పదిహేనవ 2009-14 చింతా మోహన్ కాంగ్రెస్
పదిహేనవ 2014 వెలగపల్లి వరప్రసాద రావు వైకాపా
పదహారు 2019 బల్లి దుర్గా ప్రసాదర్ రావు వైకాపా
తిరుపతి ప్రస్తుత ఉప ఎన్నిక – అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైసీపీ బాధ్యులు
తిరుపతి – మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి
శ్రీకాళహస్తి – మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి
సత్యవేడు – మంత్రి కొడాలి నాని, చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి
గూడూరు – మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సూళ్లూరుపేట – మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సర్వేపల్లి – మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి
వెంకటగిరి – మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి
తిరుపతి ఉప ఎన్నిక – అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ బాధ్యులు
ప్రతీ అసెంబ్లీ సెగ్మెంటును 10 క్లస్టర్లుగా విభజించి సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
సమన్వయ కమిటీ సభ్యులుగా…
అచ్చెన్నాయుడు, నారా లోకేష్, బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పనబాక కృష్ణయ్య
తిరుపతి ఉప ఎన్నిక – బీజేపీ ప్రచారం
బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, విష్ణువర్ధనరెడ్డి మరికొంత మంది నేతల బాధ్యతలు
ప్రచారంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
హిందూత్వంతో పాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావంపైన ఆశలు పెట్టుకున్న బీజేపీ
Also Read: పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పై కొనసాగుతున్న సస్పెన్స్..! హైకోర్టులో వాదనలు.. తదుపరి విచారణ వాయిదా..
Kuna Ravi Kumar : ఎట్టకేలకు పొందూరు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయిన టీడీపీ నేత కూన రవి కుమార్