తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి, రాజన్న రాజ్యం తెస్తామంటూ వైయస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. లోటస్ పాండ్ వేదికగా తెలంగాణ జిల్లాలకు చెందిన వైయస్ అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ విధివిధానాలు ఎలా ఉండాలి..? ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశాలపై సీనియర్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీపై టీఆర్‌ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు.
అయితే రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మాత్రం షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన గంగుల మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు. జగనన్న బాణం షర్మిల వస్తోందని.. తర్వాత మెల్లగా జగన్ వస్తాడని, జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న గంగుల కార్యకర్తలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వైయస్ షర్మిల పార్టీతో తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని, లేకపోతే సమైక్య రాష్ట్రం అవుతుందని హెచ్చరించారు. ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకపోతారని, కేసీఆరే రక్షకుడని గంగుల అన్నారు. మొత్తానికి మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు గులాబీ శిబిరంలో ఆసక్తిగా మారాయి.
Read more: