వేసీపీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు… విజయవాడ టీడీపీదేనన్న ఎంపీ కేశినేని నాని

|

Mar 03, 2021 | 7:07 PM

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఫుల్‌ జోష్‌ మీదున్న అధికార పార్టీ వైసీపీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు కసరత్తు చేస్తుంది. మరోవైపు అధికార పార్టీకి ధీటుగా టీడీపీ ఇప్పటికే ప్రచారంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ప్రచారం నిర్వహించిన ఆయన తాము కచ్చితంగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. తన 21 నెలల పాలనపై జగన్ కే నమ్మకం […]

వేసీపీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు... విజయవాడ టీడీపీదేనన్న ఎంపీ కేశినేని నాని
Follow us on

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఫుల్‌ జోష్‌ మీదున్న అధికార పార్టీ వైసీపీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు కసరత్తు చేస్తుంది. మరోవైపు అధికార పార్టీకి ధీటుగా టీడీపీ ఇప్పటికే ప్రచారంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ప్రచారం నిర్వహించిన ఆయన తాము కచ్చితంగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

తన 21 నెలల పాలనపై జగన్ కే నమ్మకం లేదని, అందుకే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. విజయవాడలో మాత్రం తాము గట్టిగా నిలబడ్డామని, నామినేషన్ల సమయంలో ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు ఎదురైనా తాము అభ్యర్థులకు అండగా నిలిచామని వెల్లడించారు. తాము అన్నిచోట్ల నామినేషన్లు వేశామని, ఇవాళ ఉపసంహరణలు చేయాలని బెదిరిస్తే ఎవరూ లొంగేవాళ్లు లేరని ఉద్ఘాటించారు. విజయవాడలో అందరూ ఫైటర్లేనని, తమనెవరూ ఒత్తిడికి గురిచేయలేరని వ్యాఖ్యానించారు.

ఇటీవల బెజవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమన్న నేపథ్యంలోనూ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటే, నాలుగు రకాల ఆలోచనా ధోరణలు ఉంటాయని అన్నారు. ఏదైనా విభేదాలు వస్తే చర్చించి పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇప్పుడు సీఎం జగన్ ఇంట్లోనూ విభేదాలున్నాయని, ఆయనొక పార్టీ పెడితే, చెల్లి షర్మిల మరో పార్టీ పెడుతోందని నాని వెల్లడించారు. ఒక ఇంట్లోనే విభేదాలున్నప్పుడు రాజకీయ పార్టీల్లో ఉండవా? అని ప్రశ్నించారు.

నిత్యావసర సరుకుల ధరలు 40శాతం పెరగడం వలన పేద, మధ్య తరగతి, దిగువ మధ్యరగతి ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని నాని అన్నారు. గ్యాస్, డీజిల్,పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రంలో 25 శాతం ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ చార్జీలు పెంచి పేదల రేషన్ కార్డులు తొలగిస్తున్నారు. ఇంటి పన్నులు,నీటి పన్నులు, డ్రైనేజ్ పనులు జీవో నెంబర్ 196 197 198 ల ద్వారా 10రెట్లు పెంచుటకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేశినేని నాని ఆరోపించారు.

జగన్ రాజధాని అమరావతిని మార్చి విజయవాడ ప్రజలకు ద్రోహం చేశారని ఎంపీ మండిపడ్డారు. రాజధాని మార్పు వల్ల ఈ ప్రాంత ప్రజల వ్యాపారాలు, ఉపాధి తగ్గి ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నారు. రాజధాని మార్పు,కృత్రిమ ఇసుక కొరత సృష్టించడం వల్ల భవన నిర్మాణం పై ఆధారపడే 40 శాతం విజయవాడ ప్రజలు ఉపాధి లేక ఆర్ధిక ఇబ్బందిపడుతున్నరు. టీడీపీ ప్రభుత్వం హయాంలో లారీ ఇసుక రేటు రూ. 4000 ఇప్పుడు వైసీపీ పాలనలో లారీ ఇసుక రేటు రూ. 25000 అయిందని నాని మండిపడ్డారు.

భారతి సిమెంట్ కోసం సిమెంట్ బస్తా ధరలు పెంచారని కేశినేని నాని ఆరపించారు. భవన నిర్మాణ రంగంపైన ఆధారపడే పరిశ్రమలు, కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా క్లిష్టసమయంలో ప్రజలను ఆదుకోవడం లో జగన్ విఫలమయ్యారు. మద్యపానం నిషేధం చేస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు పెంచడమే కాకుండా,ప్రజల ఆరోగ్యం తో ఆడుకుంటున్నారని విమర్శించారు.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి ప్రజలపై ఒక్క రూపాయి భారం వేయకుండా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్రం నుండి గతంలో కంటే రెట్టింపు నిధులు తీసుకువచ్చి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

Read more:

కాషాయం కప్పుకున్న కమ్యూనిస్టు… శారదాపీఠం దర్శనంపై ఇప్పుడేమి సమాధానం చెప్పుతావు నారాయాణా..?

విశాఖలో టీడీపీకి షాక్.. ఎమెల్యే గంటా శ్రీనివాసరావు కీలక అనుచరుడికి వైసీపీ తీర్థం