స్పీకర్ కోర్టుకు చేరిన గంటా రాజీనామా బాల్.. రాజీనామా ట్విస్టులకు ఫుల్ స్టాప్ పెడతారా..? డ్రామా కంటిన్యూ అవుతుందా..?
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏపీ పాలిటిక్స్‌లో సెగలు రేపుతుంది. కేంద్రం నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ..
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏపీ పాలిటిక్స్‌లో సెగలు రేపుతుంది. కేంద్రం నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ అన్ని పార్టీలు ఇప్పటికే పోరాట బాట పట్టాయి. అయితే మిగతా వారికంటే ఓ అడుగు ముందుకేసి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్న కేంద్రనిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన గంటా రాజీనామా చేయడం.. దాన్ని అసెంబ్లీ అధికారులు తీసుకోకపోవడం వంటి సంఘటనలతో ఆయన రాజీనామా అంశం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఇప్పటికే మూడు సార్లు గంటా రాజీనామా చేయడం అందరికీ నవ్వులాటగా మారింది. ఈసారి మాత్రం గంటా చాలా సీరియస్ గానే రాజీనామా లేఖను అసెంబ్లీకి పంపారు. విశాఖ జర్నలిస్టుల ఫోరం నేతల ద్వారా తన రాజీనామా లేఖను అసెంబ్లీకి పంపి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.
అయితే గంటా లేఖను తీసుకుని అసెంబ్లీకి చేరుకున్న జర్నలిస్టులకు విచిత్రమైన పరిస్దితులు ఎదురయ్యాయి. రాజీనామా లేఖను తీసుకోవటానికి అధికారులు తర్జన భర్జన పడ్డారట. గంటా రాజీనామా అంశం రాజకీయపరమైంది కావడంతో రాజీనామా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఏ అధికారి కూడా ముందుకు రాలేదట. తమకు సంబంధం లేదంటే తమకు సంబంధం లేదని తప్పించుకున్నారట. రాజీనామా లేఖను తీసుకోవాలని అసెంబ్లీ ఉన్నతాధికారుల చుట్టూ జర్నలిస్టులు తిరిగినా ఉపయోగం లేకపోయింది. దాంతో చేసేది లేక గంటాకే ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. గంటా వెంటనే అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. అనంతరం జర్నలిస్టులను పిలిపించుకుని గంటా రాజీనామా లేఖను తీసుకున్నన్నారు.
ఇక అసెంబ్లీ కార్యదర్శి రాజీనామా లేఖ తీసుకోవడంతో ఇప్పడు బాల్ స్పీకర్ కోర్టుకు చేరింది. తన రాజీనామా లేఖను కార్యదర్శి తీసుకున్న విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తో చెప్పారు గంటా. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని గట్టిగా కోరారు. గంటా రాజీనామా ఆమోదిస్తే.. ఇప్పుడు అందరి చూపు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై పడుతుంది. రాజీనామా చేయాలని ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మొదటి రాజీనామా అస్త్రాన్ని సందించిన గంటా శ్రీనివాసరావుకు ఎలా చూసుకున్నా ప్రయోజనమో కనిపిస్తుంది. రాజీనామా ఆమోదిస్తే ఉద్యమం కోసం రాజీనామా చేసిన వ్యక్తిగా నిలబడిపోతారు. రాజీనామా ఆమోదించకుంటే వైసీపీని ఇరుకున పెట్టినట్లు అవుతుంది. మొత్తానికి ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. ఒక్క రాజీనామాతో రెండు ప్రయోజనాలు అన్నమాట. అయితే అసలు గంటా రాజీనామా లేఖను తీసుకోవటానికి అసెంబ్లీ అధికారులు ఎందుకు వెనకాడారు అన్నదే అసలు పాయింట్.. ఇదే అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read more:
వైయస్ షర్మిల తెలంగాణ బిడ్డే.. రాష్ట్రం విడిపోయాక ఇక పంచాయతీ ఎందుకన్న మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి