Chandrababu: చట్టాన్ని వైసీపీకి చుట్టంలా మార్చుకున్నారు.. కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై చంద్రబాబు విసుర్లు

|

Aug 05, 2021 | 5:43 PM

టీడీపీనేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్‌ను అడ్డుకోవడం హేయమైన చర్యని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు..

Chandrababu: చట్టాన్ని వైసీపీకి చుట్టంలా మార్చుకున్నారు.. కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై చంద్రబాబు విసుర్లు
Chandrababu
Follow us on

Chandrababu – Devineni Uma convoy: టీడీపీనేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్‌ను అడ్డుకోవడం హేయమైన చర్యని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. హింసించి ఆనందించటం జగన్ రెడ్డికి పరిపాటిగా మారిపోయిందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా బనాయించిన అక్రమ కేసులో బెయిల్ మీద తిరిగి వస్తున్న దేవినేని ఉమ కాన్వాయ్‌ను అడ్డుకోవడం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. జాతీయ రహదారిపై పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఏ విధంగా వాహనాలు నిలిపివేస్తారని చంద్రబాబు నిలదీశారు.

దేవినేని ఉమ హనుమాన్ జంక్షన్ దగ్గర ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని పోలీసులే దగ్గరుండి గుడి తాళాలు వేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నిలదీశారు. చట్టాన్ని అధికార పక్షం చుట్టంలా మార్చుకున్నారు అంటూ చంద్రబాబు ఆక్షేపించారు. ఇలా ఉండగా, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇవాళ బెయిల్ మీద విడుదలైన దేవినేని ఉమకు టీడీపీ నేతలు, శ్రేణులు స్వాగతం పలికి తీసుకువస్తోన్న క్రమంలో భీమడోలు వద్ద పోలీసులు దేవినేని ఉమ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

కాగా, క‌ృష్ణాజిల్లా మైలవరం మైనింగ్ దాడుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ.. రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఇవాళ విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన దేవినేనికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన, ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.

కాగా, ఈ కేసుకు సంబంధించి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ పరీశీలకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద జి.కొండూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఐతే తనపై అక్రమంగా కేసులు బనాయించారంటూ దేవినేని ఉమా హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ ఆయన బయటకు వచ్చారు.

Read also: Huzurabad By Election: హుజూరాబాద్‌లో రాజకీయ హోరాహోరీ.. ఈసీ ఎన్నికల నగారాపై ఉత్కంఠ.!