Tandur Political Heat: తెలంగాణ అసెంబ్లీకి ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు.. ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే, అప్పుడే అధికార పార్టీ నేతల ఫైట్ షురూ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని నేనంటే.. నేను అంటూ కార్యకర్తలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు నేతలు. రసవత్తరంగా మారిన వికారాబాద్ జిల్లా తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హీటెక్కిన పాలిటిక్స్‌పై ప్రత్యేక కథనం…
ఆ ఇద్దరు ఒకే పార్టీ నేతలు..ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ. కానీ, ఒకరు ఒకరికి అస్సలు పొసగడం లేదు. మీదకు బాగానే కనిపించినా లోపల మాత్రం ఉప్పు నిప్పుల కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు.. ఇప్పటికే పార్టీ పెద్దలు కూర్చోబెట్టి పంచాయతీ చేసినా మళ్ళీ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటుండటంతో తాండూర్‌లో మళ్లీ అంతర్గత పోరు మొదలయింది..
తాండూర్ నియోజకవర్గంలో పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. ఒకవైపు తాండూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ వరుస వివాదాలతో హాట్ టాపిక్ అయితే, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి – ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మధ్య రచ్చ మళ్లీ రాజుకుంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్సీ హోదాలో మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే హోదాలో రోహిత్ రెడ్డి వేరు వేరు గ్రూపులు కట్టి ఒకరికి ఒకరు ఆహ్వానాలు ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. మమున్సిపల్ ఎన్నికల సమయంలో టిక్కెట్ల విషయంలో ఎమ్మెల్యే సహకరించలేదని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఇలా నిత్యం ఏదో ఒక ఇష్యూతో గొడవలు పడుతూ తెలంగాణ భవన్ వరకు పంచాయతీ తీసుకొచ్చారు.
మరోవైపు, సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ పోస్టులు పెట్టుకోవడం, ఫ్లెక్సీ లు చింపుకోవడం, చివరకు ఒక బ్యాచ్ మీద ఇంకో బ్యాచ్ పోలీసు స్టేషన్లకు ఎక్కి ఫిర్యాదులు చేసుకోవడం వరకు వెళ్లింది. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోక్యం చేసుకుని, ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడి వ్యవహారం చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు రిపీట్ కావద్దు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ జోక్యంకో కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నా, మళ్లీ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కామెంట్స్‌తో కథ మొదటికి వచ్చింది.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అసలు పైలెట్ కాదని, ఆయన ఇంటర్ సర్టిఫికేట్లు పెట్టి ఎమ్మెల్యే అయ్యాక ఎంబీఏ సర్టిఫికేట్ చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో తాండూర్ నుండి తానే పోటీ చేస్తానని ప్రెస్ మీట్ అనంతరం చిట్ చాట్ లో అనడంతో రచ్చ మళ్లీ మొదటికి వచ్చింది. ఆనోటా ఈ నోటా ఆ మాటలు రోహిత్ రెడ్డి చెవిలో పడటంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యడాని సమాచారం. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలసి.. ఎమ్మెల్సీ మహేందర్‌పై పిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ మాజీ మంత్రి ఇంట్లో నలుగురు పదవుల్లో ఉండగా మళ్లీ అన్న కొడుకు, ఆయన కొడుకు 2028 ఎన్నికల్లో పోటీ చేస్తారు అనడం పట్ల కూడా తాండూర్ నాయకులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
— శ్రీధర్ ప్రసాద్ , పొలిటికల్ ప్రతినిధి, టీవీ 9, హైదరాబాద్.