కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ ఫౌండేషన్ బిల్డింగ్ లో అనధికారికంగా వేలాది మందికి తయారుచేయించుకుంటారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్, స్టేట్ హెల్త్ సెక్రటరీ ప్రకటించినా… పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వరు అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఆనందయ్య బీసీ కాకుండా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయివుండుంటే ఇన్ని రోజులు అక్రమంగా నిర్బంధించేవారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణపట్నం ఆనందయ్య మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు మాత్రం మందు పంపిణీ ఆపేసి పెద్దోళ్లకు మాత్రం బక్కెట్లకు బక్కెట్లు పంపిస్తున్నారు.. ఇదెక్కడి న్యాయం అని అంటున్నారు సోమిరెడ్డి. ఎంతో సౌమ్యుడైన ఆనందయ్య తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ 40 ఏళ్లుగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు. కోవిడ్‌కు సంబంధించి కూడా 70 వేల మంది వరకు మందు తీసుకుంటే ఏ ఒక్కరూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు. ఇప్పుడే కాదు 40 ఏళ్లలో ఎప్పుడూ ఆనందయ్య మందు గురించి ఒక్క ఫిర్యాదు కూడా లేదు.. ఆనందయ్య మందు తీసుకున్నట్లుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మందుపై పూర్తి నమ్మకం ఉందని ప్రకటించారు. ఒంగోలు వాసులందరూ కూడా ఆ మందు కోరుకుంటున్నారని వెల్లడించారు.
ఆ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు… పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పేదలకు ఉచితంగా సేవ చేస్తున్న బీసీ వర్గానికి సంబంధించిన ఆనందయ్యను అనధికారికంగా నిర్బంధించడం బాధాకరం.. ఆనందయ్య అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇలా నిర్బంధించగలిగే వారా.. ఆయనను నిర్బంధించడం న్యాయం కాదు… వెంటనే ఆయనకు స్వేచ్ఛ కల్పించాలి.. మందు పంపిణీ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు క్షమించరు.. మందుపై అనుమానం ఉన్నవాళ్లు దానిని వాడవద్దు.