న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా శనివారం కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలలో ఆయన సొంతపార్టీపైనే బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. కొంతకాలంగా బీజేపీపై నిప్పులు చెరుగుతున్న సిన్హా ఇటీవలే రాహుల్ గాంధీని కలిసి పాట్నా సాహిబ్ నియోజకవర్గానికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. బీజేపీ అధిష్టానం లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సిన్హాను కాదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బరిలో దించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్‌లో రవిశంకర్ ప్రసాద్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా సిన్హా అమీతుమీ తేల్చుకోనున్నారు. కాగా, బీజేపీ వ్యవస్ధాపక దినం రోజే ఆ పార్టీని వీడటం బాధాకరమని, బీజేపీ నుంచి ఎందుకు వైదొలగుతున్నాననేది మీ అందరికీ తెలుసునని సిన్హా అన్నారు. బీజేపీతో తన పయనంలో తనను బాధించిన వారిని మన్నిస్తానని స్పష్టం చేశారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి దిగ్గజ నేతల మార్గదర్శకత్వంలో తాను బీజేపీలో ఎదిగానని ఆయన చెప్పుకొచ్చారు.