Punjab Elections 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ(BJP), శిరోమణి అకాలీదళ్(SAD), ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) పార్టీల నేతలు పరస్పర విమర్శలతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కేంద్రాన్ని నిలదీయాల్సిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ఘాటు విమర్శనాస్త్రాలు సంధించారు. కేజ్రీవాల్‌పై సిద్ధూ చేసిన విమర్శలను పంజాబ్ ఆప్ కో-ఇన్‌ఛార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తిప్పికొట్టారు. పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అంటూ సిద్ధూనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్‌తో సిద్ధూను పోల్చడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో నిత్యం గొడవపడుతున్న సిద్ధూ.. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి చీవాట్లు తిన్నారని రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. అందుకే సిద్ధూ ఇప్పుడు అమరీందర్ సింగ్‌ను వదిలిపెట్టి.. అర్వింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. కాస్త వేచిచూడండి.. రేపటి నుంచి మళ్లీ కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై టార్గెట్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు.
The Rakhi Sawant of Punjab politics -Navjot Singh Sidhu- has received a scolding from Congress high command for non stop rant against Capt. Therefore today,for a change, he went after Arvind Kejriwal. Wait till tomorrow for he shall resume his diatribe against Capt with vehemence https://t.co/9SDr8js8tA
— Raghav Chadha (@raghav_chadha) September 17, 2021
పంజాబ్‌లో కాంగ్రెస్ నేతలు.. మరీ ముఖ్యంగా సిద్ధూ విపక్ష నేతల్లా మాట్లాడుతున్నారంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా రాజకీయ స్టంట్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను విపక్షాల వైపునకు మళ్లకుండా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీ నేతల డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు.
117 మంది సభ్యులతో కూడిన పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చి మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ 59 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలు గెలిచి అధికారం చేపట్టింది. అక్కడ మళ్లీ గెలిచి సీఎం పదవిని చేపట్టాల్ని కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉవ్విళ్లూరుతున్నారు. పంజాబ్‌లో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేలు అంచనావేశాయి.
Also Read..