చెన్నై : అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు ఖాళీగా ఉన్న 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో రజనీకాంత్ ఆ ఎన్నికల్లో పోటీ చేస్తారని, త్వరలో పార్టీని ప్రారంభిస్తారని ప్రసారమాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని, తన ప్రధాన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలేనని రజనీకాంత్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబాయి పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం విమానంలో చెన్నై చేరుకున్న రజనీకాంత్ విమానాశ్రయం వద్ద విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో తమ పార్టీ పోటీ చేయదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి నీటి సమస్యను పరిష్కరించే పార్టీకే ఓటు వేయమని అభిమానులకు సూచించారు. ఈ విషయంపై విలేఖరులడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ నీటి సమస్యను చక్కగా పరిష్కరించే జాతీయ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీకి ఓటు వేయవచ్చునని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమికి మద్దతు ప్రకటిస్తారన్న ప్రశ్నకు ఆ విషయం గురించి ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేనని పేర్కొన్నారు.