Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీని ఇరుకున పెట్టే పని చేయాలని భావిస్తున్నారా? వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడే శక్తిని ప్రతిపక్షాలకు అందివ్వడం కోసం పావులు కదుపుతున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ వరుసగా శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో సమావేశం అయ్యారు. శరద్ పవార్ తో పలుదఫాలు ప్రశాంత్ ముచ్చటించారు. సమావేశాల పూర్తి సమాచారం బయటకు రాకపోయినప్పటికీ.. బీజేపీకి వ్యతిరేకంగా.. శరద్ పవార్ ప్రధాని అభ్యర్ధిగా బలమైన కూటమి ఏర్పాట్ల వైపు ప్రతిపక్షాలను ప్రశాంత్ నడిపిస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వరుస సమావేశాలు రాజకీయ వర్గాల్లో బలమైన సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్ ను రాష్ట్రపతిగా ఎన్నికయ్యేలా చేసేందుకు లాబీయింగ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రశాంత్ కిషోర్ మూడుసార్లు శరద్ పవార్ ను కలిశారు. శరద్ పవార్ న్యూ ఢిల్లీ నివాసంలో జరిగిన ఈ సమావేశాలలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశాలు ప్రశాంత్ కిషోర్ తదుపరి అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలకు దారితీసింది. ఏదేమైనా, 2024 పార్లమెంటు ఎన్నికలలో “మూడవ ఫ్రంట్ లేదా నాల్గవ ఫ్రంట్” బీజేపీని సవాలు చేయగలదని తాను నమ్మడం లేదని ప్రశాంత్ కిషోర్ అలాంటి ఊహాగానాలను ఖండించారు.
కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఆయన సమావేశం బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష రాజకీయ పోరాటానికి కొత్త కోణాన్ని జోడించింది. ఇది వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల చుట్టూ కేంద్రీకృతమై ఉండవచ్చు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ లెక్కలో, ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (బిజెడి) నాయకుడు నవీన్ పట్నాయక్ ఎన్డీయేతర పార్టీలతో చేతులు కలిపితే అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం ప్రతిపక్ష అభ్యర్థికి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష పాలిత మహారాష్ట్ర, తమిళనాడులలోని సంఖ్యలు కూడా ఆ అభ్యర్థికి అనుకూలంగా ఉంటాయి. అయితే, నవీన్ పట్నాయక్ ఎప్పుడూ ఒక మాటకు కట్టుబడి ఉండరనే అనుమానం మిగిలిన వారిలో అలానే ఉంది. ప్రశాంత్ కిషోర్ ఇటీవల నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్లను కలిశారని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశం ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చిందని భావిస్తున్నారు. రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ సమావేశం మంగళవారం దాదాపు రెండు గంటలు కొనసాగింది. ప్రశాంత్ కిషోర్ లెక్క ప్రకారం, బలమైన ప్రతిపక్ష ఐక్యత తో వారు బీజేపీని కలవరపెట్టె చాన్స్ ఉంది. అదేవిధంగా, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఇది దేశంలో రాజకీయ ఆటను మార్చే అంశం కావచ్చు.
ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, జగన్ మోహన్ రెడ్డి, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేలతో మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్న ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్షాలను కూడా కట్టుకోవడం చాలా సులభం. అయితే, ఇందుకు ఆయన కాంగ్రెస్‌ను ఈ ముగ్గులోకి తీసుకురాగలగాలి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా వీడియో లింక్ ద్వారా రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ సమావేశంలో చేరారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల మంగళవారం సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రశాంత్ గాంధీ ప్రశాంత్ కిషోర్-రాహుల్ గాంధీ సమావేశంలో పాల్గొనడానికి తన లక్నో పర్యటనను వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ తన ప్రణాళికల గురించి కాంగ్రెస్ నాయకత్వానికి వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారని, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఉన్న అవకాశాలను, సంభావ్యతలను కూడా క్లుప్తీకరించారనీ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఈ సమీకరణాలు.. ప్రశాంత్ కిషోర్ అడుగులూ చూస్తుంటే, బీజేపేని తద్వారా మోడీని ఇరుకున పెట్టడానికి శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ముందుకు తీసుకు వచ్చి కొత్త ఆట మొదలు పెట్టారని మెజార్టీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Ghar Wapasi: తెలంగాణలో రాజకీయ ఘర్ వాపసీ.. ఎవరి ధీమాలో వారు.. అధినేతల తీరే వేరు..!