వాళ్లేమైనా పాకిస్థానీయులా..? పరదేశీయులా..? కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన శరద్ పవార్
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యకు..
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం ఉధృతరూపం దాలుస్తుంది. ఇప్పటి వరకు ఢిల్లీ సరిహద్దులకే పరిమితమైన పోరాటం క్రమంగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. కేంద్ర చట్టాలను తక్షణమే ఉపసంహిరంచుకోవాలంటూ నాసిక్ నుంచి ముంబై వరకు రైతులు పాదయాత్ర నిర్వహించారు.
అల్ ఇండియా కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యకు సరైన పరిష్కారం చూపకపోవడం దారుణమని శరద్ పవార్ విమర్శించారు.
ఢిల్లీలో సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ప్రసంగించిన శరద్‌పవార్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని, ప్రధాని నరంద్రమోదీ తీరును తప్పుపట్టారు. ఎముకలు కొరికే చలిలో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలమంది రైతులు గత 60 రోజులుగా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ రైతుల ఆందోళనపై కనీసం ఆరా తీశారా..? హక్కుల కోసం ఆందోళన చేస్తున్న రైతులు ఏమైనా పాకిస్థానీయులా..? పరదేశీయులా..? అని శరద్ పవార్ ప్రశ్నించారు.