నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలైన ఓట్లను తిరిగి లెక్కించాలన్న తమ డిమాండును అక్కడి ఎన్నికల అధికారి తిరస్కరించారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. తిరిగి ఓట్ల లెక్కింపునకు ఉత్తరువులిస్తే నీ ప్రాణాలకే ముప్పు వస్తుందని ఆయనను ఎవరో హెచ్చరించారని తనకు తెలిసిందని ఆమె చెప్పారు. ఈ మేరకు నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారికి బెదిరింపులు అందాయని, దాంతో ఆయన భయపడిపోయారని ఆమె అన్నారు. ఇలా చేస్తే తన కుటుంబం కష్టాల్లో పడుతుందని, తనకు చిన్న కూతురు కూడా ఉందని ఆ అధికారి వాపోయినట్టు తనకు ఎవరో ఫోన్ లో ఎస్ ఓ ఎస్ మెసేజ్ పంపారని మమత వివరించారు. అసలు నిన్నఓట్ల లెక్కింపు కేంద్రంలో 4 గంటలపాటు సర్వర్లు పని చేయలేదని, అప్పటికే గవర్నర్ తనకు అభినందన సందేశం కూడా పంపారని ఆమె చెప్పారు. కానీ కొద్దిసేపటికే సీన్ మారిపోయిందన్నారు. 11 రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి కన్నా మమతా బెనర్జీ ముందంజలో ఉన్నా ఆ తరువాత ట్రెండ్ మారిపోయినట్టు తెలిసింది. చివరకు సువెందు అధికారి విజయం సాధించినట్టు ప్రకటించారు. నందిగ్రామ్ ఫలితం అనుమానాస్పదంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రీన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మూడింట రెండువంతులు విజయం సాధించిన పార్టీకి నేతృత్వం వహించిన ముఖ్యమంత్రి తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ ఫలితాలను సమీక్షించాలని, పోలైన ఓట్లను తిరిగి లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా మమతా బెనర్జీకి ఎవరైనా కావాలనే ఈ ఎస్ ఓ ఎస్ మెసేజ్ పంపారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయని అంటున్నారు. ఓట్ల విషయంలో ఆమె దృష్టి మళ్లించడానికి ఎవరైనా ఇందుకు ప్రయత్నించి ఉండవచ్చునని కూడా అంటున్నారు. నిజంగా ఆ ఎన్నికల అధికారికి బెదిరింపు కాల్ అందిందా అన్నవిషయం నిగ్గు తేలాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: మూడు రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల తగ్గుదల , కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన, కానీ ముప్పు పొంచే ఉందని హెచ్చరిక
Covid-19: పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం.. యువతిని పొట్టనబెట్టుకున్న కరోనా..