AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగన్‌వాడీలకు త్వరలోనే తీపి వార్త.. కాషాయం పార్టీకి ప్రజలు త్వరలోనే కర్రు కాల్చి వాత పెడతారు -సత్యవతి రాథోడ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అంగన్‌వాడీలకు వేతనాలు పెరిగాయని, గౌరవం లభించిందనీ, ఈ వేతనాల పెంపు మరింత ఈ ప్రభుత్వంలోనే..

అంగన్‌వాడీలకు త్వరలోనే తీపి వార్త.. కాషాయం పార్టీకి ప్రజలు త్వరలోనే కర్రు కాల్చి వాత పెడతారు -సత్యవతి రాథోడ్‌
K Sammaiah
|

Updated on: Mar 04, 2021 | 5:33 PM

Share

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అంగన్‌వాడీలకు వేతనాలు పెరిగాయని, గౌరవం లభించిందనీ, ఈ వేతనాల పెంపు మరింత ఈ ప్రభుత్వంలోనే పెరుగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. అంగన్వాడిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్సీఒలు, విఓఏలతో మహబూబాబాద్ లో నేడు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అంగన్వాడీ సమస్యలపై ఈ ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందని, త్వరలోనే అంగన్వాడి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం చేసిన మేలుకు అనుగుణంగా అందరూ టిఆర్ఎస్ పార్టీ నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు పట్టభద్రులకు, ఉద్యోగులకు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రభుత్వానికి ఈ వర్గాల పట్ల మరింత నమ్మకాన్ని పెంచుతుందనీ చెప్పారు.

కోవిడ్ సమయంలో అంగన్వాడీలు అద్భుతంగా పని చేశారని, దీన్ని ముఖ్యమంత్రి గుర్తించారని, దానికి అనుగుణంగా త్వరలోనే ముఖ్యమంత్రి నుంచి శుభవార్త ఉంటుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంగన్వాడీలు అంటే ప్రత్యేక ఇష్టమని, అందుకే రెండు సార్లు వారికి వేతనాలు పెంచి, వర్కర్లను నుంచి టీచర్లుగా వారి సంబోధనను మార్చి గౌరవం కల్పించారన్నారు. దీనిని గుర్తించి అంగన్వాడీలు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బీజేపి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదన్నది అందరికీ తెలిసిందేనని, బిజెపి నేతల పాపం పెరిగినట్లు గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు. బిజెపి వల్ల అంబానీలకు, అదానిలకు తప్ప సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదని, త్వరలోనే ఈ సామాన్యులు అంతా కలిసి బిజెపికి సరైన బుద్ధి చెబుతారని మంత్రి తెలిపారు. బిజెపి రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, వరంగల్లో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా ఈ రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతున్నదని అన్నారు. అయినా కేసీఆర్ గారు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా, కరోనా సమయంలో కూడా అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించి ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటి చెప్పారన్నారు. కాబట్టి నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఎమ్మెల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీల రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాధవి, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షురాలు వాణి, మహబూబాబాద్ మెడికల్ అండ్ హెల్త్ కార్మిక విభాగం అధ్యక్షులు నాగేశ్వర రావు, ఇతర నేతలు, తదితరులు పాల్గొన్నారు.