AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ మేయర్ టీడీపీ అభ్యర్ధిగా కేశినేని శ్వేత.. ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

విజయవాడ టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత పేరు ఖరారైంది. కేశినేని శ్వేత పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది.

విజయవాడ మేయర్ టీడీపీ అభ్యర్ధిగా కేశినేని శ్వేత..  ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు
Balaraju Goud
|

Updated on: Mar 04, 2021 | 5:31 PM

Share

Andhra pradesh Municipal polls : విజయవాడ టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత పేరు ఖరారైంది. కేశినేని శ్వేత పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. మేయర్‌ సీటు కోసం టీడీపీలో చాలా మంది పోటీ పడ్డారు. శ్వేతతో పాటు సందిరెడ్డి గాయత్రి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే, అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ అధిష్టానం కేశినేని నాని కూతురు శ్వేత పేరును ప్రకటించింది. శ్వేత ప్రస్తుతం 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే డివిజన్లలో కేశినేని కుటుంబం సుడిగాలి పర్యటనలు చేస్తోంది. ఈ మధ్యలో కాలంలో వచ్చిన విభేదాల నేపథ్యంలో… మేయర్‌ పదవి కూడా కమ్మ సామాజికవర్గానికి ఇస్తారా అనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మేయర్‌ పదవి మాట ఎలా ఉన్నా… తన డివిజన్‌లో గెలుపుతోపాటు కార్పొరేషన్‌లోనూ టీడీపీ విజయం ఖాయమంటున్నారు కేశినేని శ్వేత

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో అన్ని జిల్లాలోనూ ప్రచారం జోరందుకుంది. మేయర్‌, ఛైర్‌పర్సన్‌ పీఠాలపై ఆశావహులు దృష్టి సారించారు. ఆశావహుల వైపు అభ్యర్థులు చూపు సారించారు. ప్రచార ఖర్చుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఒకే కొన్ని నగర పంచాయతీలో ఛైర్‌పర్సన్‌ అభ్యర్థులను టీడీపీ, వైసీపీ ప్రకటించింది. ఇవాళ టీడీపీ విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ప్రకటించడంతో, మచిలీపట్నం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. రెండు పురపాలక సంఘాలు, రెండు నగర పంచాయతీల్లో ఇంకా ఖరారు కావల్సి ఉంది.

కృష్ణా జిల్లాలో ప్రధానంగా రెండు కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరుగుతున్నాయి. విజయవాడ కార్పొరేషన్‌, మచిలీపట్నం ఉన్నాయి. బందరు కార్పొరేషన్‌కు మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రెండూ జనరల్‌ మహిళకు మేయరు పదవి రిజర్వు చేశారు. మొత్తం 64 డివిజన్లలో 32 డివిజన్లు నుంచి పోటీ చేసి గెలుపొందే మహిళలు అర్హులు. జనరల్‌ కాబట్టి ఎక్కువ మంది ఆశించే అవకాశం ఉంది.

తెలుగు దేశం పార్టీ తరఫున ఎంపీ కేశినేని నాని కూతురు 11వ డివిజన్‌ నుంచి పోటీలో ఉన్న కేశినేని శ్వేత పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో పాటు ఆశించేవారు ఎక్కువ మందే ఉన్నారు. బీసీ మహిళకు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారని ఒక వర్గం ప్రచారం చేసుకుంది. 10వ డివిజన్‌ నుంచి పోటీలో ఉన్న దేవినేని అపర్ణ కూడా మేయర్ పీఠం కోసం ప్రయత్నించారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి కూడా కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరికి కేశినేని శ్వేత పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. దీంతో ఎక్కువ డివిజన్లు టీడీపీ గెలుపొంది మేయర్ పీటం కైవసం చేసుకుంటామని కేశినేని శ్వేత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక అధికార వైఎస్‌ఆర్‌సీపీ నుంచి సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆశిస్తున్నారు. గత పాలకవర్గంలో ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న పుణ్యశీల పోటీ పడుతున్నారు. కానీ, జిల్లా మంత్రి నుంచి మద్దతు లేదని తెలిసింది. ఆయన మాత్రం చైతన్యరెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం. మరోవైపు, గౌతంరెడ్డి కూతురు డాక్టర్‌ లిఖిత పోటీ చేస్తున్నారు. ఆమె కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. సెంట్రల్‌ నుంచే పోటీలో ఉన్న ఓ కాంట్రాక్టర్‌ భార్య శ్రీశైలజ పేరు తెరమీదకు వచ్చింది. ఈ కుటుంబం సీఎం జగన్‌కు సన్నిహితులుగా చెబుతున్నారు. దీంతో మిగిలిన డివిజన్లలో పోటీలో ఉన్న అభ్యర్థులు భారీగా ప్రచార ఖర్చులు ఆశిస్తున్నారు.

ఇక, మచిలీపట్నం కార్పొరేషన్‌లోనూ మేయరు అభ్యర్థులను ప్రకటించలేదు. జనరల్‌ మహిళకు రిజర్వు అయిన ఈ కార్పొరేషన్‌లో మంత్రి పేర్ని నాని వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఫలితాల తర్వాత మేయర్‌ అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తున్నారు. మైనార్టీ కానీ, బీసీ మహిళను కానీ మేయరుగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అటు, టీడీపీ తరఫున జలయలక్ష్మి పేరు ప్రచారంలో ఉంది. మచిలీపట్నంలో మొత్తం 50 డివిజన్లు ఉండగా 25 మహిళలకు రిజర్వు అయ్యాయి.

Read Also…  పట్టభద్రుల ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కే ఉంది.. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్రమే చెప్పింది -మంత్రి వేముల