Minister Harish Rao Coments : తెలంగాణలో ప్రజలు టీడీపీని ఆదరించరని.. అందుకే టీడీపీ కార్యకర్తలందరు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేశ్, వివిధ పార్టీల నాయకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరికయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ.. ఈ దెబ్బతో సిద్ధిపేటలో టీడీపీ ఖాళీ అయిందని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడ్డాక పెను మార్పులు సంభవించాయన్నారు. తెలంగాణ అంటే టీఆర్‌ఎస్.. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ అన్నారు. జిల్లాలో గోదావరి జలాలతో 1600కోట్ల విలువ గల పంటలు పండుతున్నాయన్నారు.
ఒకప్పుడు కాలం కాక కరువుతో పట్టణంలో అంబలి కేంద్రం ఏర్పాటు చేసేవాళ్లంన.. కానీ నేడు పసిడి పంటలు పండుతున్నాయని తెలిపారు. పొట్ట చేతపట్టకుని వలస వెళ్లిన వారు నేడు గ్రామాలకు తిరిగి వచ్చి పంటలు పండిస్తున్నారని అన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు 500పెన్షన్, 6గంటల కరెంట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 3వేల పెన్షన్ 24గంటల కరెంట్ ఇస్తుందన్నారు. కరోనాతో బీజేపీ పాలిత ప్రాంతాలు గడగడలాడుతున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 18 సార్లు పెట్రోల్ ధరలు పెంచిందన్నారు.
బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుందని ఆరోపించారు. కేంద్రం బడ్జెట్ లో రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్ లో 25వేల కోట్లు కోత పెట్టిందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిద్ధిపేట అన్ని రంగాల్లో డెవలప్ అయిందన్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతం నుంచి పట్టణాలకు వలసవెళ్లే ప్రజలు ఇప్పడు అందరు గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. హరితహారంతో గ్రామాలన్ని పచ్చగా మారాయన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ తప్ప ఏ పార్టీ మనుగడ సాధించలేదని పేర్కొన్నారు.