Minister Harish Rao: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంటలో రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ తదితర టీఆర్‌ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ..హుజూరాబాద్ ఎన్నిక న్యాయానికి – అన్యాయానికి, ధర్మానికి – అధర్మానికి మధ్య జరిగే ఎన్నికని అన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు ఆలోచన జేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా అందించిందన్నారు. మూడున్నర సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగు నీరు కల్పిస్తుందన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చేసి రైతుల కోసం రైతు వేదికలు నిర్మించిందని గుర్తు చేశారు.
‘బీజేపీ ప్రభుత్వం బావిల దగ్గర, బోర్ల దగ్గర మీటర్లు పెట్టి రైతులు ఎన్ని యూనిట్ల కరెంటు కాలుస్తున్నారో లెక్కలు తీయమని చెపుతోంది. డీజీల్ రేట్లు పెంచి రైతుల మీద భారం మోపింది. కాళేశ్వరం ప్రాజెక్టు తన చేతుల్లోకి తీసుకోని ప్రాజెక్టే లేకుండా చేస్తానంటోంది. ఏది గెలవాలి.. రైతుల సంక్షేమం కోసం పని చేసే తెరాస గెలవాలా..కోతలు వాతలు పెట్టే బీజేపీ గెలవాలా.. ప్రజలు మీరే ఆలోచన జేయండి. రెడ్డి సోదరుల ఆత్మీయ సభకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చారని ఈటల కామెంట్ చేశారు. పక్క ఊరోళ్లు ఒక్కరన్నా వచ్చారా.. ఆయనకు గుండెలు అదురుతున్నాయి ఏం చెప్పాలో తెలియక పక్క ఊరి నుంచి వచ్చారని చెబుతున్నారు’ అంటూ హరీశ్ రావు కామెంట్ చేశారు.
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాజేందర్ మాటల్లో నిజం కూడా అంతే ఉంటుందన్నారు. భోజనం కోసం, మందు కోసం వస్తున్నారని హుజూరాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఆరు సార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను అవమానపరుస్తున్నారు. రాజేందర్ కు మీరే తగిన గుణపాఠం చెప్పాలి.. చిత్తు చిత్తుగా ఓడించాలని అన్నారు. ఈటల బీజేపీలో చేరి నియోజక వర్గ ప్రజలకు ఏం చేయదల్చుకున్నారని ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం పార్టీ మారారని, బీజేపీ ఏ రకంగా హుజూరాబాద్ ప్రజలకు మేలు చేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, చేతనైతే హుజూరాబాద్ కు వేయి కోట్ల ప్యాకేజీ తీసుకురాగలవా అంటూ ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు, ప్రతీ అకౌంట్‌లో15 లక్షలు వేస్తామన్నారు, నల్ల ధనం వెనక్కు తెస్తామన్నారు దమ్ముంటే ఇవన్నీ తీసుకురాగలవా అంటూ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రజల కోసం పని చేసే టీఆర్ఎస్ ను బలపర్చండని ప్రజలను కోరారు. రెడ్డి సోదరుల్లో సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని తాను మాట ఇస్తున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్ ప్రజలకు 5 వేల ఇళ్లు మంజూరు చేయిస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ది తెరాస గెలుపులో ఇమిడి ఉందని పేర్కొన్నారు. ఈబీసీని అమలు చేయాలని అడిగిన వెంటనే ఎలాంటి షరతులు లేకుండా ఈబీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. భవిష్యత్తులో సీఎంగారి ఆశీస్సులతో రెడ్డి కార్పోరేషన్ కూడా సాధించుకుందామన్నారు. అన్ని వర్గాల్లోని పెదలను కాపాడుకోవాలన్నది సీఎంగారి ఆలోచన అన్నారు. గెల్లు శ్రీనును ఆశీర్వదించి గెలిపించి హూజురాబాద్ ను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలను కోరారు.